కాంగ్రెస్ పార్టీ రాజస్తాన్ ఉదయ్ పూర్ వేదికగా ‘ చింతన్ శిబిర్’ నిర్వహిస్తోంది. నేటి నుంచి మూడు రోజుల పాటు ఈ సమావేశాలు జరగనున్నాయి. ఇప్పటికే దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని కాంగ్రెస్ కీలక నేతలు ఉదయ్ పూర్ తరలివెళ్లారు. వరస పరాజయాలతో ఢీలా పడిన కాంగ్రెస్ పార్టీ బలపడేందుకు చింతన్ శిబిర్ ఉపయోగపడుతుందని ఆ పార్టీ భావిస్తోంది. ఇప్పటికే ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీతో పాటు రాహుల్ గాంధీ, ఇతర కాంగ్రెస్ నేతలతో కీలక సమావేశాలు నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ పటిష్టానికి తీసుకోవాల్సిన సూచనలు చేశారు.
ఇదిలా ఉంటే తొలి రోజే కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ బీజేపీ పార్టీపై విరుచుకుపడ్డారు. బీజేపీ పార్టీ గాంధీ హంతకులను ఆరాధిస్తోందని.. మైనారిటీలను క్రూరంగా అణచివేస్తోందిని విమర్శించారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ వీటి అనుబంధ సంస్థల వల్ల దేశం అనేక సవాళ్లను ఎదుర్కొంటుందని… వాటిని చర్చించడానికి ‘ నవ కల్పన చింతన్ శిబిర్’ ఉపయోగపడుతుందని ఆమె అన్నారు. కేంద్ర దర్యాప్తు సంస్థలను బీజేపీ దుర్వినియోగం చేస్తుందని… ప్రతిపక్షాలను కేసుల పేరుతో భయపెట్టాలని చూస్తోందని సోనియా గాంధీ విమర్శించారు. దేశంలో మైనారిటీకు సమాన హక్కులు ఉన్నాయని.. అయితే బీజేపీ వారిని క్రూరంగా అణచివేస్తోందని ఆమె దుయ్యబట్టారు. దేశ ప్రజల్ని బీజేపీ భయాందోళనలకు గురిచేస్తుందని విమర్శించారు. బీజేపీ ప్రభుత్వం మినిమం గవర్నమెంట్.. మాగ్జిమమ్ గవర్నెన్స్ అని చెప్పారని… దీని అర్థం ప్రజల్ని నిట్టనిలువునా చీల్చడం అంటూ విమర్శలు చేశారు.
ప్రస్తుతం జరుగుతున్న చింతన్ శిబిర్ లో కాంగ్రెస్ పలు తీర్మానాలు చేయనుంది. ముఖ్యంగా ఒకే కుటుంబానికి ఒకే టికెట్, యువతకు పెద్దపీట వేయడం, పార్టీలో అనేక సంస్కరణల గురించి ప్రత్యేకంగా చర్చించనున్నారు. దీంతో పాటు కాంగ్రెస్ ను ఇరుకున పెడుతున్న కాంగ్రెస్ సీనియర్ నేతల గ్రూప్ జీ 23 చేసిన సూచనలను కూడా పరిగణలోకి తీసుకోనున్నారు. జీ 23 సూచించిన విధంగా పార్లమెంటరీ బోర్డ్ మెకానిజాన్ని మళ్లీ పునరుద్ధరించే అవకాశం కనిపిస్తోంది.