2002లో గోద్రా రైలు దహనకాండ తర్వాత గుజరాత్లో చెలరేగిన అల్లర్లలో బిల్కిస్ బానో కుటుంబానికి చెందిన ఏడుగురిని హత్య చేశారు దుండగులు. ఆ టైంలో ఐదు నెలల గర్భిణిగా ఉన్న బానోపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ కేసులో 11 మంది నిందితులకు 2008 జనవరి 21న జీవిత ఖైదు విధించింది ముంబై సీబీఐ ప్రత్యేక కోర్టు . 15ఏళ్లు కారాగారంలోనే ఉన్నారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా వీరి విడుదలకు గుజరాత్ ప్రభుత్వం నుంచి ఆదేశాలు రావడంతో.. గోద్రా సబ్ జైలు నుంచి విడుదల చేశారు అధికారులు. అంతేకాదు వీరికి పెద్ద ఎత్తున ఓ సంస్థ స్వాగతాలు పలకడం, మిఠాయిలు పంచుకోవడం కూడా వివాదమైంది. దోషుల విడుదలపై జాతీయస్థాయిలో తీవ్ర చర్చ జరుగుతోంది. బిల్కిస్ సహా ఆమె కుటుంబ సభ్యులు ప్రభుత్వ తీరుపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. సుప్రీం కోర్టు జోక్యం చేసుకుని, దోషుల విడుదల ఉత్తర్వులను రద్దు చెయ్యాలని కోరుతున్నారు. ఇలా వాడివేడిగా చర్చ జరుగుతున్న టైంలోనే, బీజేపీ నేతల మాటలు, పుండు మీద కారంలా మారాయి.
Read Also: Drink More Alcohol: మద్యం తాగండి ప్లీజ్.. సర్కార్ రిక్వెస్ట్..!
ఇప్పటికే బీజేపీ ప్రభుత్వం నిర్ణయంపై దుమారం చెలరేగుతుంటే.. ఇదే టైంలో బీజేపీ ఎమ్మెల్యే చేసిన కామెంట్లు సంచలనంగా మారాయి. బిల్కిస్ బానోపై అత్యాచారం కేసులోని దోషుల్లో కొందరు బ్రాహ్మణులు ఉన్నారని, వారు సంస్కారవంతులని చెప్పుకొచ్చారు. గుజరాత్లోని గోద్రా బీజేపీ ఎమ్మెల్యే సి.కె.రౌల్జీ. అంతటితో ఆగని రౌల్ జీ… వారు నేరం చేశారో లేదో తనకు తెలియదని, కానీ నేరం చేసే ఉద్దేశం ఉండి ఉండదని వ్యాఖ్యానించారు. వారిలో కొంతమంది బ్రాహ్మణులు ఉన్నారని.. బ్రాహ్మణులు మంచి సంస్కారవంతులని సర్టిఫికెట్ ఇచ్చేశాడు. వారిని శిక్షించాలని కొందరి దురుద్దేశం అయి ఉండవచ్చని దోషులను వెనకేసుకొచ్చారు రౌల్.
ఇవీ బీజేపీ ఎమ్మెల్యే సి.కె.రౌల్ జీ మాటలు. నేరస్తుల్లోనూ ఈయన కులం కోణం వెతికారు. ఈ కేసులో దోషులకు శిక్షను తగ్గించాలని సిఫార్సు చేసిన ప్రభుత్వ కమిటీలోని ఇద్దరు బీజేపీ నేతల్లో ఎమ్మెల్యే రౌల్జీ ఒక సభ్యుడు. రౌల్ జీ కామెంట్లపై విమర్శలు చెలరేగుతున్నాయి. ఓ ప్రజాప్రతినిధి చేసే కామెంట్లు ఇవేనా అని మండిపడుతున్నారు. మరోవైపు నిందితులను విడుదలపై బాధితురాలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఆ 11 మందిని విడిచి పెట్టడానికి ముందు తన అభిప్రాయాన్ని, భద్రతను ఎవరూ అడగలేదని… తాను స్వేచ్ఛగా ఈ సమాజంలో జీవించే హక్కును కల్పించాలని గుజరాత్ ప్రభత్వాన్ని కోరారు బిల్కిస్ బానో.