జన శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌లో ఓ పాము ప్రయాణికులను హడలెత్తించింది. ట్రైన్ వేగంగా దూసుకెళ్తుండగా హఠాత్తుగా లగేజీ స్టాండ్ మీద నుంచి స్నేక్ రావడం ప్రయాణికులు గమనించారు. దీంతో ఒక్కసారిగా ప్యాసింజర్స్ బెంబేలెత్తిపోయారు. ఈ ఘటన భోపాల్ నుంచి జబల్‌పూర్ వెళ్తుండగా చోటుచేసుకుంది. ప్రయాణికులు భయాందోళనకు గురైన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
పాము సీట్ల పైన ఉన్న లగేజీ రాక్‌పై విశ్రాంతి తీసుకుంటుంది. పామును గుర్తించిన వెంటనే ప్రయాణికులు అప్రమత్తంగా తమ సీట్ల నుంచి దూరంగా వెళ్లిపోయారు. ఇక ఈ ఘటనపై రైల్వేశాఖ విచారణ చేపట్టింది. భద్రత, పరిశుభ్రత సమస్యలపై సంస్థ దర్యాప్తు చేపట్టింది. తలపైనే పాము వేలాడంతో సీట్లలో కూర్చున్న ప్రయాణికులు భయాందోళన చెందారు.
సీపీఆర్‌ఎస్ హర్షిత్ శ్రీవాస్తవ తెలిపిన వివరాల ప్రకారం.. రెండు రోజుల క్రితం రైలు లోపల పాము కనిపించిందన్నారు. రైళ్లలో పాముల బెడద పెరుగుతున్న నేపథ్యంలో రైల్వే శాఖ రైలు క్లీనింగ్ సమయంలో అప్రమత్తంగా ఉండేలా కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించిందని చెప్పారు. రైలు అటెండర్లు కూడా మరింత జాగ్రత్తగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. పాములను ఉద్దేశపూర్వకంగా రైళ్లలోకి విడిచిపెట్టారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
ఇలాంటి ఘటన జరగడం ఇదే మొదటిసారి కాదు. సెప్టెంబర్‌లో జబల్‌పూర్-ముంబై గరీబ్ రథ్ ఎక్స్‌ప్రెస్‌లో కూడా పాము కనిపించింది. ఈ సంఘటనలతో రైల్వే భద్రతపై ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రైల్వేశాఖ తగిన భద్రతా ఏర్పాట్లు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
#WATCH | Panic Grips Passengers After Snake Found Inside C-1 Coach Of Bhopal-Jabalpur Jan Shatabdi Express#Jabalpur #MadhyaPradesh #MPNews pic.twitter.com/9vx16jp53s
— Free Press Madhya Pradesh (@FreePressMP) November 20, 2024