Prakash Raj: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల దగ్గర పడుతున్న కొద్దీ ఆ రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. తాజాగా కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ బీజేపీకి మద్దతు ప్రకటించడం హాట్ టాపిక్ గా మారింది. తాను బీజేపీ తరుపున పోటీ చేయడం లేదని చెబుతూనే.. తన మద్దతు ఉంటుందని ప్రకటించారు. ఈయనతో పాటు మరో స్టార్ హీరో దర్శన్ కూడా బీజేపీలో చేరుతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి.
Read Also: Vandebharat: తెలుగు రాష్ట్రాల వందేభారత్ రైలుపై మరోసారి రాళ్ల దాడి.. రాకపోకల్లో ఆలస్యం
ఇదిలా ఉంటే సినీ యాక్టర్ ప్రకాష్ రాజ్ దీనిపై స్పందించారు. సుదీప్ బీజేపీకి మద్దతు ఇవ్వడంపై ప్రకాష్ రాజ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కిచ్చా సుదీప్ ప్రకటనతో తాను షాక్ కు గురయ్యానని, బాధపడ్డానని అన్నారు. బీజేపీ, ప్రధాని నరేంద్రమోదీపై తరుచూ విమర్శలు గుప్పించే ప్రకాష్ రాజ్, సుదీప్ బీజేపీకి మద్దతు ప్రకటించడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. అయితే కర్ణాటకలో ఓడిపోబోతున్న బీజేపీ నిరాశలో ఇలాంటి వార్తలను వ్యాప్తి చేస్తుందని సుదీప్ మద్దతు ఇచ్చే ముందు ప్రకాష్ రాజ్ వ్యాఖ్యానించారు.
కర్ణాటక అసెంబ్లీకి మే 10న ఎన్నికలు జరగబోతున్నాయి. మే 13న ఫలితాలు విడుదల కానున్నాయి. అయితే ఈ సారి ఎలాగైనా అధికారంలోకి రావాలని కాంగ్రెస్ భావిస్తోంది. మరోవైపు రెండోసారి వరసగా అధికారం చేజిక్కించుకోవాలని బీజేపీ భావిస్తోంది. 2024 లోక్ సభ ఎన్నికల ముందు కర్ణాటక ఎన్నికలను సెమీఫైనల్స్ గా రాజకీయ పార్టీలు భావిస్తున్నాయి.