Vandebharat Express: సికింద్రాబాద్, విశాఖ మధ్య నడుస్తున్న వందే భారత్ రైలుపై మరోసారి రాళ్లదాడి జరిగింది. రైల్వేశాఖ ఎన్నిసార్లు హెచ్చరికలు జారీ చేసినా.. పరిస్థితిలో మాత్రం మార్పు రావడం లేదు. బుధవారం సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్తున్న దారిలో.. ఖమ్మం-విజయవాడ మధ్య రైలుపై గుర్తు తెలియని దుండగులు రాళ్లు విసిరారు. దీంతో C-8 కోచ్ అద్దాలు పగిలిపోయాయి. కోచ్ మరమ్మత్తుల నేపథ్యంలో గురువారం విశాఖ నుంచి రైలు ఆలస్యంగా బయలుదేరుతోంది. విశాఖ నుంచి 5.45కు బయలుదేరి వెళ్లాల్సిన వందే భారత్ ఆలస్యం..షెడ్యూల్ కంటే ఆలస్యంగా 9.45కి బయలుదేరనుంది.
Read Also: Hanuman Jayanti: ఢిల్లీలో హై అలర్ట్.. జహంగీర్‌పురిలో భారీ భద్రత..
గతంలోనూ ఈ రూట్‌లో వందే భారత్‌పై రాళ్ల దాడులు జరిగాయి. ఫిబ్రవరిలో ఖమ్మం రైల్వే స్టేషన్ సమీపంలో, అంతకు ముందు సైతం ఓసారి ఇలాగే దాడి జరిగింది. వరుసగా రైళ్లపై రాళ్ల దాడి జరగడంతో దక్షిణ మధ్య రైల్వే సీరియస్‌గా స్పందించింది. కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. రాళ్లదాడికి పాల్పడే నిందితులపై రైల్వే చట్టంలోని సెక్షన్ 153 ప్రకారం ఐదేళ్ల వరకు జైలు శిక్ష పడుతుందని హెచ్చరించడంతో పాటు నేరం చేసిన వారిపై కేసులు నమోదు చేసిన కేసుల్లో 39 మందిని అరెస్టు కూడా చేశారు. ఇదిలా ఉండగా.. శనివారం కొత్తగా సికింద్రాబాద్-తిరుపతి రూట్‌లో ప్రధాని మోదీ వందేభారత్ రైలును ప్రధాని మోదీ ప్రారంభించనున్న విషయం విదితమే.