Shiv Sena-UBT: ఢిల్లీ ఎన్నికల్లో ఆప్ పరాజయంతో పాటు కాంగ్రెస్ ఘోరంగా ఓడిపోవడంపై ఇండియా కూటమిలోని ఇతర నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో 70 స్థానాలకు గానూ బీజేపీ 48 స్థానాల్లో, ఆప్ 22 స్థానాల్లో గెలుపొందింది. వరసగా మూడోసారి కూడా కాంగ్రెస్ సున్నా స్థానాలకు పరిమితమైంది. 67 చోట్ల కాంగ్రెస్ అభ్యర్థుల డిపాజిట్లు గల్లంతయ్యాయి. అత్యంత అవమానకర రీతిలో కాంగ్రెస్ ఓడిపోయింది.
Read Also: PM Modi: మిత్రుడు ‘‘ట్రంప్’’ని కలవడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్న.. మోడీ సందేశం..
ఇండియా కూటమిలో ప్రధాన భాగస్వాములైన కాంగ్రెస్, ఆప్ కలిసి పోటీ చేయకపోవడంతోనే బీజేపీ గెలిచిందని కూటమి నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. ఇద్దరి మధ్య విభేదాలే బీజేపీ గెలుపుకు కారణమయ్యాయని ఉద్ధవ్ ఠాక్రే శివసేన తెలిపింది. శివసేన-యూబీటీ మౌత్ పీస్ పత్రిక ‘‘సామ్నా’’లోని సంపాదకీయంలో.. ఆప్, కాంగ్రెస్ తన ప్రత్యర్థి బీజేపీతో కాకుండా తమలో తాము పోరాడాయని, ఇలాంటి సందర్భంలో ప్రతిపక్షాల మధ్య పొత్తులు ఎందుకు..? అని ప్రశ్నించింది.
‘‘ఢిల్లీలో ఆప్, కాంగ్రెస్ ఒకరినొకరు నాశనం చేసుకోవడానికి పోరాడాయి. దీని వలన ప్రధాని మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలకు పని సులభతరం అయింది. ఇది ఇలాగే కొనసాగితే పొత్తులు ఎందుకు ఏర్పాటు చేసుకోవాలి..? మీ మనసుకు నచ్చినంత వరకు పోరాడండి’’ అంటూ కఠినంగా వ్యాఖ్యానించింది. ఇలాంటి పరిస్థితులే మహారాష్ట్రలో కూడా నిరాశను కలిగించాయని చెప్పింది. ఢిల్లీ ఎన్నికల నుంచి ప్రతిపక్షాలు గుణపాఠాలు నేర్చుకోకుంటే, మోడీ-షాల ‘‘నిరంకుశ పాలన’’ బలోపేతమవుతుందని హెచ్చరించింది.