DK Shivakumar: కాంగ్రెస్ పార్టీలో అసలు ఏం జరుగుతోంది. హస్తం పార్టీలో ఎంపీ శశిథరూర్, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌లు కలకలం రేపుతున్నారు. వీరిద్దరు బీజేపీకి దగ్గరయ్యారనే వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా, ఇషాఇషా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు, ప్రముఖ ఆధ్యాత్మిక నాయకుడు సద్గురు నిర్వహించిన మహాశివరాత్రి కార్యక్రమానికి డీకే శివకుమార్ వెళ్లడంపై సొంత పార్టీలోనే విమర్శలు ఎదుర్కొంటున్నారు. అంతకుముందు ఈయన ప్రయాగ్‌రాజ్‌లో జరిగిన కుంభమేళాకు వెళ్లడం కూడా వివాదాస్పదమైంది.
ఏఐసీసీ కార్యదర్శి పీవీ మోహన్ ఎక్స్‌లో శివకుమార్ తీరుపై అసహనం వ్యక్తం చేశారు. ఆయన చర్య పార్టీ మూలాలను దెబ్బతీస్తుందని అని అన్నారు. బుధవారం జరిగిన కార్యక్రమంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో , శివకుమార్ వేదికను పంచుకున్నారు. మహాశివరాత్రి కార్యక్రమంలో పాల్గొనడం ఇప్పుడు కాంగ్రెస్‌లో చర్చనీయాంశంగా మారింది. పీవీ మోహన్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ వంటి లౌకిక పార్టీగా అధ్యక్షుడిగా పనిచేస్తున్నప్పుడు, రాహుల్ గాంధీని ఎగతాళి చేసే వ్యక్తికి మీరు ఎలా థాంక్స్ చెప్పగలరు అని శివకుమార్‌ని ప్రశ్నించారు.
Read Also: Pune Rape Case: సంచలనంగా పూణే అత్యాచార ఘటన.. చెరకు తోటలో నిందితుడు, డ్రోన్లతో గాలింపు..
కర్ణాటకలో సిద్ధరామయ్యతో అధికార పోరాటం కొనసాగుతున్న నేపథ్యంలో డీకే శివకుమార్ బీజేపీకి దగ్గరవుతున్నారనే సందేశం ఇస్తున్నారంటూ పొలిటికల్ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇదిలా ఉంటే, ఈ ఊహాగానాలను డీకే శివకుమార్ కొట్టివేశారు. తాను హిందువునని, అదే సమయంలో కాంగ్రెస్‌వాదిని అని చెప్పారు.
మరోవైపు తిరువననంతపురం ఎంపీ, కాంగ్రెస్ నేత, మాజీ కేంద్ర మంత్రి శశిథరూర్ వ్యవహారం కూడా కాంగ్రెస్‌ని భయపెడుతోంది. తాజాగా ఓ టీవీ పాడ్‌కాస్ట్‌లో ఆయన మాట్లాడుతూ.. ‘‘పార్టీకి నా అవసరం లేకుంటే, తనకు వేరే ఆప్షన్స్ ఉన్నాయి’’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనికి తోడు ఇటీవల కేంద్ర వాణిజ్య మంత్రి పియూష్ గోయల్‌లో సెల్ఫీ దిగి దానిని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అంతకుముందు, ట్రంప్‌తో మోడీ భేటీ కావడాన్ని ప్రశంసించారు. కేరళలోని అధికార సీపీఎం ప్రభుత్వంపై థరూర్ పొగడ్తలు కురిపించడం కూడా కాంగ్రెస్‌లో ఆగ్రహానికి కారణమైంది.