ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి పెద్ద షాకే తగిలింది.. పంజాబ్‌పై ఎన్నో ఆశలు పెట్టుకున్నా.. ఏ మాత్రం గట్టిపోటీ ఇవ్వలేని పరిస్థితి.. దిగ్గజాలు సైతం ఓటమిపాలయ్యారు. ఇక, మూలిగే నక్కపై తాటిపండు పడిన చందంగా.. కాంగ్రెస్‌కు మరో షాక్ తగిలింది. కర్ణాటకకు చెందిన కీలక నేత, ఎమ్మెల్సీ సీఎం ఇబ్రహీం.. పార్టీకి గుడ్‌బై చెప్పేశారు.. ఈ మేరకు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీకి లేఖ రాశారు. తాను వెంటనే పార్టీ నుంచి వైదొలుగుతున్నట్లు లేఖలో పేర్కొన్నారు.
Read Also: Telangana: 16 నుంచి ఒంటిపూట బడులు
కాగా, కర్ణాటక శాసన మండలిలో ప్రతిపక్ష నాయకుడి పదవి ఆశించిన ఇబ్రహీం.. తనకంటే జూనియర్ అయిన బీకే హరిప్రసాద్‌ను శాసన మండలిలో ప్రతిపక్ష నేతగా నియమించడంపై అసంతృప్తితో ఉన్నారు.. ఈ నేపథ్యంలోనే పార్టీ నుంచి, పదవి నుంచి వైదొలుగుతున్నట్టు ప్రకటించారు. గత 12 ఏళ్లుగా పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి తాను పలు లేఖలు రాశానని పేర్కొన్న ఆయన.. నేను పార్టీకి సంబంధించిన అనేక ఫిర్యాదులను మీ ముందు ఉంచాను.. మీరు అవసరమైన పరిష్కార చర్యలు తీసుకుంటామని సమాధానం ఇచ్చారు. కానీ, ఇప్పటి వరకు నాకు ఎలాంటి మార్పులు కనిపించలేదని.. తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు. ఇక, ఇబ్రహీం, మాజీ ప్రధాని హెచ్‌డీ దేవెగౌడకు సన్నిహితుడిగా ఉన్నారు.. 2008లో కాంగ్రెస్ పార్టీలో చేరారు. సుదీర్ఘకాలం పార్టీలో కొనసాగిన ఆయన.. కొంతకాలంగా పార్టీ మరియు కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ నాయకుడు సిద్ధరామయ్యతో విభేదించారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి నేను వెంటనే రాజీనామా చేస్తున్నాను.. కర్ణాటక శాసనసభలో ప్రతిపక్ష నాయకుడు సిద్ధరామయ్య ద్వారా కర్ణాటక లెజిస్లేటివ్ కౌన్సిల్ చైర్మన్, కర్ణాటక శాసన మండలి సభ్యత్వానికి నా రాజీనామా లేఖను కూడా పంపుతున్నాను. దయచేసి నా రాజీనామాను ఆమోదించండి అని లేఖలో రాసుకొచ్చారు సీఎం ఇబ్రహీం.