Kerala: 10 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసిన బీజేపీ కార్యకర్త, పాఠశాల ఉపాధ్యాయుడికి శనివారం కోర్టు జీవితఖైదు విధించింది. తలస్సేరి ఫాస్ట్ ట్రాక్ స్పెషల్ కోర్టు కడవత్తూర్ నివాసి పద్మరాజన్ కే అలియాస్ పప్పెన్ మాస్టర్(48)కి శిక్షను ఖరారు చేసింది. 2020 జనవరి, ఫిబ్రవరి మధ్య కన్నూర్ లోని పలతాయిలో పనిచేస్తున్న సమయంలో, మైనర్ బాలికపై పదే పదే లైంగిక వేధింపులకు పాల్పడిన కేసులో దోషిగా తేలాడు. ఐపిసి సెక్షన్ 376AB (12 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న బాలికపై అత్యాచారం) కింద పద్మరాజన్‌కు కోర్టు జీవిత ఖైదు, లక్ష రూపాయల జరిమానా విధించింది. పోక్సో చట్టం ప్రకారం 10 ఏళ్ల జైలు శిక్ష, రూ. 50,000 జరిమానాను కూడా విధించింది. ఈ రెండు శిక్షల్ని ఒకేసారి అనుభవించాల్సి ఉంటుందని కోర్టు ఆదేశించింది. జరిమానా మొత్తాన్ని బాధితుడికి చెల్లించాలని ఆదేశించింది.
Read Also: Delhi Blast: ఢిల్లీ కార్ బ్లాస్ట్ కేసు, మరో ముగ్గురు డాక్టర్లు అరెస్ట్..
10 ఏళ్ల విద్యార్థినిపై స్కూల్ టాయిలెట్, ఆయన ఇంట్లో అత్యాచారానికి పాల్పడ్డాడు. పానూర్ పోలీసులు మార్చి 17, 2020న కేసు నమోదు చేసి, ఏప్రిల్ 15న నిందితుడిని అరెస్ట్ చేశారు. అయితే, ఈ కేసు ఎస్‌డీపీఐ కుట్రలో భాగమని బీజేపీ ఆరోపించింది. ఈ కేసును కేరళ క్రైమ్ బ్రాంచ్ దర్యాప్తు చేసింది. మొదట దోషిపై పోక్సో కేసు పెట్టలేదు. దీంతో అతడికి బెయిల్ లభించింది. బాధిత కుటుంబం బెయిల్‌ను వ్యతిరేకించడంతో కేరళ హైకోర్టు మళ్లీ కొత్త దర్యాప్తుకు ఆదేశించింది. అడిషనల్ డీఐజీ జయరాజ్ నేతృత్వంలో దర్యాప్తు బృందం దర్యాప్తు పూర్తి చేసి ఛార్జిషీట్ దాఖలు చేసింది. గత ఏడాది ఫిబ్రవరిలో విచారణ ప్రారంభమైంది. మొత్తం 42 మంది సాక్షులను విచారించారు.