ఓ కేసులో నిందితుడిగా ఉన్న యువకుడు, విద్యార్థి విభాగం నాయకుడికి బెయిల్ వచ్చింది.. దీంతో, అతడికి అనుకూలంగా సంబరాలే జరిగాయి… ఏకంగా పోస్టర్లు వెలిశాయి.. అయ్యగారి కీర్తిని చాటుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు.. ఈ పరిణామాలను సీరియస్‌గా తీసుకున్న సుప్రీంకోర్టు.. తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. నిందితుడు బెయిల్ రద్దు చేసింది.. అంతే కాదు వారం రోజుల్లో లొంగిపోవాలంటూ ఆదేశాలు జారీ చేసింది..
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. అత్యాచారం కేసులో నిందితుడైన మధ్యప్రదేశ్ యువకుడికి బెయిల్ మంజూరైంది.. స్థానికంగా విద్యార్థి యువజన విభాగం నేతగా ఉన్న అతడి విడుదల సందర్భంగా పెద్ద రచ్చే జరిగింది.. జైలు నుంచి విడుదలైన సమయంలో ‘భయ్యా ఈజ్ బ్యాక్’ అంటూ పోస్టర్లు వెలిశాయి.. నిందితుడిని స్వాగతిస్తూ బాధితురాలు నివసిస్తున్న ప్రాంతంలో ‘భయ్యా ఈజ్ బ్యాక్’ అంటూ పోస్టర్లు వేశారు.. అంతేకాదు సోషల్ మీడియాలో యువకుడిపై ప్రశంసలు కురిపిస్తూ స్వాగతం పలికారు.. అయితే, ఈ వ్యవహారంపై సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. నిందితుడికి హైకోర్టు ఇచ్చిన బెయిల్ ఉత్తర్వులను రద్దు చేసింది.. వారం రోజుల్లోగా లొంగిపోవాలంటూ ఆదేశాలు జారీ చేసింది..
బెయిల్ వచ్చిన తర్వాత నిందితుడి ప్రవర్తన బాధితురాలి మదిలో భయాలు రేకెత్తించేలా ఉందని ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ.. నిందితుడు బెయిల్‌పై ఉంటే స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా విచారణ జరగదేమోన్న భయం బాధితురాలిలో కలిగించేలా వ్యవహరించారని.. సాక్షులను ప్రభావితం చేస్తాడని ఆమె భావించేలా వారి ప్రవర్తన ఉందని.. ఈ నేపథ్యంలో నిందితుడు బెయిల్‌కు అర్హుడు కాదని భావిస్తున్నాం… హైకోర్టు తన బెయిల్ ఉత్తర్వుల్లో నిందితుడి నేర చరిత్రను వదిలేసింది.. అందుకే అతడి బెయిల్ ఉత్తర్వులను రద్దు చేస్తున్నాం… నిందితుడు వారం రోజుల్లో లొంగిపోవాలని ఆదేశాలు జారీ చేశారు.