RSS: తమిళనాడులో తిరుప్పరంకుండ్రంలోని ‘‘సుబ్రమణ్య స్వామి’’ ఆలయ దీపం వివాదం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. కొండపై ఉన్న ఆలయ స్తంభం వద్ద దీపం వెలిగించాలని మద్రాస్ హైకోర్టు తీర్పు చెప్పినప్పటికీ, డీఎంకే ప్రభుత్వం మాత్రం కొండ కింద ఉన్న దీపం వెలిగించేందుకే అనుమతి ఇచ్చింది. మరోవైపు, కుమారస్వామి భక్తులు మాత్రం కొండపైకి వెళ్లేందుకు ప్రయత్నించడంతో ఇటీవల ఉద్రిక్తతలు చెలరేగాయి. ఇదిలా ఉంటే, ఈ తీర్పు చెప్పిన న్యాయమూర్తి స్వామినాథన్‌ను తొలగించాలని కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీ, డీఎంకేలు కలిసి ఆయనపై ‘‘అభిశంసన’’ తీర్మానాన్ని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు అప్పగించింది.
Read Also: Mamata Banerjee: ‘‘BSF పోస్టుల వద్దకు మాత్రం వెళ్లకండి’’.. SIRపై మమతా సంచలన వ్యాఖ్యలు..
అయితే, ఈ వివాదంలోకి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) ఎంట్రీ ఇచ్చింది. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ మాట్లాడుతూ.. తిరుప్పరంకుండ్రం సమస్యకు పరిష్కారం తీసుకురావడానికి “తమిళనాడులో హిందువుల చైతన్యం” సరిపోతుందని, ప్రస్తుతం న్యాయస్థానం పరిధిలో ఉన్న ఈ విషయానికి ఇప్పుడప్పుడే జాతీయ స్థాయిలో జోక్యం అవసరం లేదని అన్నారు. తిరుచ్చిలో జరిగిన ‘సంఘ్ ప్రస్థాన వందేళ్లు’ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన ఒక ఇంటరాక్టివ్ సెషన్‌లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సమస్యను సంఘ్ జాతీయ స్థాయికి తీసుకెళ్లాలని హిందువుల్లో ఉన్న అంచనాలపై బీజేపీ నేత హెచ్ రాజా అడిగిన ప్రశ్నకు భగవత్ ఈ సమాధానం ఇచ్చారు.
‘‘అవసరమైతే ఈ వివాదాన్ని జాతీయ స్థాయికి తీసుకెళ్తాం, కానీ దాని అవసరం ఇప్పుడు ఉందని నేను అనుకోవడం లేదు. ఈ విషయం న్యాయస్థానం పరిధిలో ఉంది. అది పరిష్కారం కానివ్వండి. తమిళనాడులో హిందువుల చైతన్యం ఈ సమస్యను పరిష్కరిస్తుందని నేను భావిస్తున్నాను. అవసరమైతే మేము ఈ విషయం గురించి ఆలోచిస్తాము ’’ అని ఆయన అన్నారు. ఈ సమస్య హిందువులకు అనుకూలంగా పరిష్కారం కావాలి, దాని కోసం ఏం చేయాల్సి వచ్చినా, ఆర్ఎస్ఎస్ చేస్తుందని అన్నారు.