Aam Admi Party: ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. నరేంద్ర మోడీ నేతృత్వంలోని సర్కారు ఢిల్లీలోని కేజ్రీ సర్కారును కూల్చేందుకు ప్రయత్నిస్తోందని ఆప్ ఆరోపించింది. ఆప్ ఎమ్మెల్యేలను నగదు, బెదిరింపులతో ప్రలోభపెట్టేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఐదుగురు ఆప్ సీనియర్ నేతలు మీడియా సమావేశంలో మండిపడ్డారు. ఢిల్లీకి చెందిన తమ ఎమ్మెల్యేలపై బెదిరింపులకు పాల్పడుతోందని ఆరోపించారు. పార్టీ మారకపోతే సీబీఐ దాడులను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించినట్లు ఆరోపించారు. ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాపై మద్యం పాలసీలో అవినీతి జరిగిందని ఇటీవల సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) దాడి నేపథ్యంలో పక్కదారి పట్టించడానికి ఆప్ ప్రయత్నిస్తోందని బీజేపీ ఆరోపించింది.
తమ ఎమ్మెల్యేలైన అజయ్ దత్, సంజీవ్ ఝా, సోమనాథ్ భారతి, కుల్దీప్ కుమార్‌ను బీజేపీ సంప్రదించిందని ఆప్ జాతీయ ప్రతినిధి, రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ తెలిపారు. బీజేపీలో చేరితే ఈ నలుగురికీ రూ.20 కోట్లు చొప్పున ఇస్తామని మాటిచ్చారని చెప్పారు. ఇతర ఎమ్మెల్యేలను కూడా తమతో తీసుకొస్తే రూ.25 కోట్లు ముట్టజెప్తామని బీజేపీ ప్రలోభపెడుతోందని వివరించారు. ఆప్ ఎమ్మెల్యేలను బీజేపీ సభ్యులు బెదిరిస్తున్నారని ఆరోపించారు. “మా ఆఫర్‌ను ₹ 20 కోట్లు తీసుకోండి లేదా సిసోడియా వంటి సీబీఐ కేసులను ఎదుర్కోండి” అని బెదిరించినట్లు సంజయ్ చెప్పారు. దేశ రాజధానిలో ప్రభుత్వాన్ని పడగొట్టడానికి కేంద్ర ఏజెన్సీలను మోడీ నేతృత్వంలోని సర్కారు ఎలా ఉపయోగిస్తుందో తాను బహిర్గతం చేస్తాయనని ఆయన పేర్కొన్నారు. ఢిల్లీ ఎమ్మెల్యేలను విచ్ఛిన్నం చేసే ప్రయత్నాలు ప్రారంభమయ్యాయని ఆరోపించారు. సిసోడియాపై ఉన్న కేసులు నకిలీవని తమకు తెలుసునని, అయితే ఆప్‌ని గద్దె దించాలని బీజేపీ సీనియర్ నేతలు నిర్ణయించుకున్నారని, ఆప్ నేతలను చేర్చుకునే బాధ్యతను బీజేపీ నేతలకు అప్పగించారని సోమనాథ్ భారతి అన్నారు. ఏది ఏమైనా ఢిల్లీ ప్రభుత్వాన్ని కూల్చివేస్తామని బీజేపీ నేత ఒకరు తనతో అన్నారని వెల్లడించారు.
Bihar: బలపరీక్షకు ముందే స్పీకర్ రాజీనామా.. భావోద్వేగ ప్రసంగం అనంతరం..
దీనిపై ఆమ్ ఆద్మీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ట్విట్టర్‌లో స్పందించారు. ఇది తీవ్రమైన అంశమని పేర్కొన్నారు. ఎమ్మెల్యేల కొనుగోలుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్న వార్తల నేపథ్యంలో అత్యవసర భేటీకి పిలుపునిచ్చారు. సీబీఐ, ఈడీ విచారణ ఎదుర్కొంటున్న మనీష్ సిసోడియా కూడా బీజేపీపై తమ పార్టీ ఎమ్మెల్యేలు ప్రాణాలైనా ఇస్తారని, అంతేతప్ప పార్టీకి ద్రోహం చేయరని అన్నారు. పార్టీ సభ్యులంతా కేజ్రీవాల్ సైనికులని, స్వాతంత్ర్య సమరయోధుడు భగత్‌సింగ్ అనుచరులని చెప్పుకొచ్చారు. తనను పార్టీ నుంచి విడగొట్టే ప్రయత్నాలు విఫలమయ్యాయని.. అందుకే ఎమ్మెల్యేలకు డబ్బు ఆశ చూపడంతో పాటు సీబీఐ, ఈడీ దాడులు ఎదుర్కోవాల్సి వస్తుందని బెదిరిస్తున్నారని సిసోడియా ట్వీట్ చేశారు.
దీనిపై బీజేపీ ఎదురుదాడికి దిగింది. ఆప్ ఆరోపణలపై బీజేపీ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా స్పందిస్తూ.. కేజ్రీవాల్ పార్టీ “ట్రైలర్‌లను” విడుదల చేస్తూనే ఉంటుంది, అయితే “చిత్రం” ఎప్పుడూ రాలేదని అన్నారు. ఢిల్లీ మంత్రులపై వచ్చిన అవినీతి ఆరోపణలను నుంచి తప్పుకునేందుకు కొత్త నాటకాలు ఆడుతున్నారని ఆయన విమర్శించారు.