దేశంలో నిరుద్యోగం, కరోనా కష్టాలు, ఆర్థిక ఇబ్బందులు, ధరల పెరుగుదల ఎలా వున్నా.. యువతను మత్తులో దించేందుకు ముఠాలు నిరంతరం పనిచేస్తున్నాయి. దేశాన్ని పట్టి పీడిస్తున్న డ్రగ్స్ దందా నానాటికీ పెరిగిపోతోంది. ఎక్కడ అవకాశం వుంటే అక్కడ డ్రగ్స్ రవాణా విచ్చలవిడిగా సాగుతోంది. ఇప్పటికే భారీ మొత్తంలో మాదక ద్రవ్యాలు పట్టుబడిన గుజరాత్‌లో తాజాగా మరోమారు భారీ ఎత్తున డ్రగ్స్ పట్టుబడ్డాయి. గుజరాత్‌లో గురువారం నాడు 256 కిలోల హెరాయిన్‌ను నార్కోటిక్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ డ్రగ్స్ విలువ రూ.1,500 కోట్లకు పైగానే ఉంటుందని తెలుస్తోంది.
గత ఏడాది కరోనా టైంలోనే డ్రగ్స్ ముఠా తమ కార్యకలాపాలు విస్తరించింది. సముద్రమార్గాన డ్రగ్స్ రవాణాకు తెరతీసింది. ఆప్ఘనిస్తాన్ నుంచి ఏపీలోని విజయవాడకు తరలివస్తున్న వేల కోట్ల రూపాయల విలువ చేసే డ్రగ్స్‌ను గుజరాత్‌లోనే అధికారులు పట్టుకున్నారు. అప్పట్లో అది సంచలనం కలిగించిన సంగతి తెలిసిందే. నాడు ఈ వ్యవహారంపై రాజకీయంగానే పెద్ద ఎత్తున దుమారం రేగింది. ఇప్పుడు ఇంత భారీ స్థాయిలో డ్రగ్స్ రవాణా కావడం కలవరం కలిగిస్తోంది. ఈ డ్రగ్స్ దందాను అరికట్టాలని ప్రజలు కోరుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో అటు గంజాయి, ఇటు డ్రగ్స్ దందా పోలీసులకు, నార్కోటిక్ అధికారులకు సవాల్ గా మారింది. హైదరాబాద్ లో డ్రంక్ అండ్ డ్రైవ్ తరహాలోనే డ్రగ్స్ టెస్ట్ లకు కూడా పోలీసులు రెడీ అయ్యారు. కాలేజీల్లో, పబ్ లలో విచ్చలవిడిగా డ్రగ్స్ సరఫరా కావడం ఆందోళన కలిగిస్తోంది. ప్రభుత్వాలు పకడ్బందీ చర్యలు తీసుకోకపోతే యువత డ్రగ్స్ బారిన పడి తమ భవిష్యత్ ని నాశనం చేసుకోవడం ఖాయం.
Read Also: IPL 2022 : ఉత్కంఠ నడుమ విజయం సాధించిన సీఎస్‌కే.. ధోని సూపర్ ఇన్నింగ్స్..