Foreign Exchange: కరోనా ప్రపంచదేశాలను అతలాకుతలం చేసింది.. మళ్లీ కొన్ని దేశాలు మినహా చాలా దేశాల్లో సాధారణ పరిస్థితులు సారవడంతో.. విదేశీయానం పెరిగింది.. భారత్‌కు పర్యాటకులు పెద్ద సంఖ్యలో వస్తున్నారు. విదేశీ పర్యాటకుల ద్వారా 2022 ఆర్థిక సంవత్సరంలో దేశానికి ఒక లక్షా 34 వేల కోట్ల రూపాయల విదేశీ మారక ద్రవ్యం లభించిందని పర్యాటక శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి తెలిపారు. రాజ్యసభలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు.. రాతపూర్వకంగా సమాధానం ఇచ్చిన కిషన్‌రెడ్డి.. 2021 ఆర్థిక సంవత్సరంలో పర్యాటకుల ద్వారా 65 వేల కోట్ల రూపాయల విదేశీ మారక ద్రవ్యం వచ్చినట్లు చెప్పారు. 2019లో కోవిడ్ ప్రబలడానికి ముందు కోటి మంది విదేశీ పర్యాటకులు దేశంలోని వివిధ ప్రాంతాలను సందర్శించారు. ఇమ్మిగ్రేషన్ బ్యూరో అందించిన తాజా సమాచారం ప్రకారం 2022లో దేశాన్ని సందర్శించిన విదేశీ పర్యాటకుల సంఖ్య 60 లక్షలు ఉన్నట్లు తెలిపారు.
Read Also: Sanju Samson: సంజూ శాంసన్ దెబ్బ.. ఆల్‌టైమ్ రికార్డ్ అబ్బ
ఇక, కోవిడ్ ప్రభావం తగ్గిన తర్వాత విదేశీ పర్యాటకం గణనీయంగా పుంజుకుంటోందని వెల్లడించారు మంత్రి కిషన్‌రెడ్డి. పర్యాటక రంగాన్ని ప్రోత్సహించేందుకు తమ మంత్రిత్వ శాఖ స్వదేశ్ దర్శన్, ప్రసాద్ వంటి వినూత్న పథకాలతోపాటు పర్యాటక ప్రదేశాల్లో మౌలిక వసతులను మెరుగుపరచేందుకు ఆయా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఆర్థిక సహాయం అందిస్తోందని అన్నారు. విదేశీ పర్యాటకులకు పర్యాటక ప్రాంతాలకు సంబంధించిన సమాచారం అందించేందుకు పర్యాటక మంత్రిత్వ శాఖ 12 విదేశీ భాషల్లో టూరిస్టు హెల్ప్‌లైన్‌ను ప్రారంభించిందని పేర్కొన్నారు.. 166 దేశాలకు సంబంధించిన పర్యాటకులకు అయిదు సబ్- కేటగిరీల్లో ఈ వీసా మంజురు చేసే సౌలభ్యాన్ని అందుబాటులోకి తీసుకు వచ్చింది. 1000 నుంచి 7500 రూపాయలు ఉండే హోటల్ గది అద్దెలపై జీఎస్టీని 12 శాతానికి తగ్గించి పర్యాటక ప్రాంతాల్లో వసతి సౌకర్యాల కల్పనకు పోటీని పెంచేందుకు దోహదం పడిందన్నారు.. పర్యాటక మంత్రిత్వ శాఖ సిఫార్సుల మేరకు 59 టూరిజం రూట్లను వివిధ ఎయిర్‌లైన్స్‌కు కేటాయించినట్లు చెప్పారు. దేశంలో 55 ప్రాంతాల్లో జీ 20 సమావేశాలు జరుగుతున్నాయి. పర్యాటకుల కోసం ఈ ప్రదేశాల్లో మౌలిక వసతులను మరింత మెరుగుపరుస్తున్నట్లు తెలిపారు. జీ 20 ప్రతినిధులు దేశంలోని వివిధ ప్రముఖ పర్యాటక ప్రాంతాలను సందర్శించేలా చర్యలు తీసుకుంటున్నట్లు రాజ్యసభలో సమాధానం ఇస్తూ స్పష్టం చేశారు కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి. కిషన్‌రెడ్డి.