తమిళనాడులో ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. సోమవారం జరిగిన ఈ ప్రమాదంలో నవ దంపతులు మృతిచెందడం ఇరు కుటుంబాలలో తీరని శోకం నెలకొంది. వివరాలలోకి వెళితే.. తమిళనాడులోని అరక్కోణానికి చెందిన మనోజ్ కుమార్ (31)కు, తాంబరం పెరుంగళత్తూరుకు చెందిన కార్తీక(30)కు నాలుగు రోజుల క్రితం అనగా అక్టోబర్ 28న ఘనంగా పెళ్లి జరిగింది. పెళ్లి తరువాత పెరుంగళ్తూరు నుంచి అరక్కోణం నవ దంపతులు కారులో బయలుదేరారు. ముచ్చట్లు చెప్పుకుంటూ, కొత్త జీవితం గురించి మాట్లాడుకుంటూ వస్తున్న ఆ జంట కారు మప్పేడు సమీపానికి వచ్చేసరికి అరక్కోణం నుంచి వస్తున్నా ఒక సిమెంట్ ట్యాంకర్ లారీ అదుపు తప్పి వారి కారును ఢీకొంది.
బలంగా లారీ ఢీకొనడంతో కారులో ఉన్న నవ దంపతులు ఇద్దరు అక్కడిక్కడే మృతిచెందారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కారులో ఇరుక్కొని ఉన్న మృతదేహాలను బయటికి తీశారు. పెళ్లి చేసుకొని కొత్త కోడలితో ఇంటికి వస్తాడనుకున్న కొడుకు విగతజీవిగా ఇంటికి వచ్చేసరికి ఆ తల్లిదండ్రులు గుండెలు పగిలేలా రోదించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.