Road accident in Karnataka.. 9 people died: కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కర్ణాటక ఆర్టీసీ, పాల ట్యాంకర్, టెంపో ట్రావెలర్ వాహనాలు ఢీకొన్నాయి. మూడు వాహనాలు ఢీకొనడం వల్ల ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉంది. టెంపో వాహనంలో ప్రయాణాస్తున్న ఒకే కుటుంబానికి చెందిన 9 మంది మరణించారు. ఈ ఘటన శనివరాం రాత్రి 11 గంటలకు హసన్ జిల్లా బాణావర పోలీస్ స్టేషన్ పరిధిలో చెలువనహళ్లి ప్రాంతంలో జరిగింది. బస్సు, పాల ట్యాంకర్ మధ్య టెంపో వాహనం నలిగిపోవడం వల్ల ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉంది.
మృతులు అంతా ధర్మస్థల, సుబ్రమణ్య, హసనాంబ ఆలయాలను సందర్శించి ఇంటికి తిరిగి వెళ్తుండగా.. ఈ ప్రమాదం జరిగింది. శివమొగ్గ నుంచి వెళ్తున్న కేఎస్ఆర్టీసీ బస్సు, ముందున్న టెంపో వాహనాన్ని ఢీకొట్టంది. దీంతో టెంపో వాహనం నియంత్రణ తప్పి ఎదురుగా వస్తున్న పాల ట్యాంకర్ ను ఢీకొట్టింది. దీంతో టెంపో వాహనం నుజ్జునుజ్జు అయింది. రెండు వాహనాల మధ్య టెంపో చిక్కుకుపోయింది. ఈ ఘటన జరిగిన సమయంలో ప్రయాణికులు అంతా నిద్రలో ఉన్నారు. దీంతో ప్రమాదం జరిగిన వెంటనే తేరుకునే లోపే అందులో చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో నలుగురు పిల్లలు కూడా ఉన్నట్లు ఎస్పీ హరిరామ్ శంకర్ వెల్లడించారు.
Read Also: Ebola outbreak: ఉగాండాలో “ఎబోలా” కల్లోలం.. లాక్‌డౌన్ విధింపు
ప్రమాదంతో ఆర్టీసీ బస్సులోని 10 మంది ప్రయాణికులు గాయపడ్డారు. చికిత్స నిమిత్తం వీరందరిని ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. టెంపోలో మొత్తం 14 మంది ఉంటే 9 మంది మరణించారు. ప్రమాదం జరిగిన వెంటనే ఆరుగురు ప్రాణాలు కోల్పోగా.. మరో ముగ్గురు ఆస్పత్రికి తరలిస్తున్న సమయంలో మరణించారు. ఒకే కుటుంబానికి చెందిన తొమ్మిది మంది మరణించడంతో వారి స్వస్థలాల్లో విషాదం నెలకొంది.