బీహార్ అసెంబ్లీ ఎన్నికల వేళ ఆర్జేడీకి బిగ్ షాక్ తగిలింది. ఆర్జేడీ రాష్ట్ర మహిళా విభాగం నాయకురాలు ప్రతిమా కుష్వాహా పార్టీకి గుడ్‌బై చెప్పారు. శనివారం ఆమె కాషాయ కండువా కప్పుకున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు దిలీప్ జైస్వాల్ ఆధ్వర్యంలో బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా దిలీప్ జైస్వాల్ మాట్లాడుతూ.. అట్టడుగు స్థాయి నాయకులకు ఆర్జేడీలో గౌరవం లేదు అని ఆరోపించారు. ఆర్జేడీ, కాంగ్రెస్‌లో బంధుప్రీతి, వంశపారంపర్య రాజకీయాలు ఎక్కువగా ఉంటాయని తెలిపారు. ఈ కారణంగానే ఆ పార్టీ నాయకులు చాలా మంది బీజేపీలో చేరుతున్నారని చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నాయకత్వంలో ఎన్డీఏ మళ్లీ బీహార్‌లో మూడింట రెండు వంతుల మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
ఇది కూడా చదవండి: Lalu Prasad: ‘అబద్ధాల రాజు’.. డబుల్ ఇంజిన్ సర్కార్‌పై లాలూ ప్రసాద్ మండిపాటు
ప్రతిమా కుష్వాహా మాట్లాడుతూ ఆర్జేడీపై విరుచుకుపడ్డారు. ‘‘లాలూ ప్రసాద్ యాదవ్ హయాంలో ఉన్న పార్టీలా ఆర్జేడీ ఇప్పుడు లేదు. సాధారణ నాయకులను గౌరవించడం లేదు. పార్టీ, దానికి నాయకత్వం వహిస్తున్న కుటుంబంతో పాటు తీవ్రంగా విచ్ఛిన్నమైంది.’’ అని ప్రతిమా కుష్వాహా ఆర్జేడీ నాయకత్వాన్ని విమర్శించారు. బీహార్ యువతకు ఉద్యోగాలు కల్పిస్తామని ఆర్జేడీ నాయకుడు తేజస్వి యాదవ్ చేసిన వాదనను ప్రస్తావిస్తూ ‘‘ఆర్జేడీ తన పాలనలో ఉద్యోగాలు ఇచ్చింది. కానీ ప్రజల నుంచి భూమిని లాక్కుంటూ’’ అని ఆరోపించారు. భూమికి ఉద్యోగం కుంభకోణాన్ని ప్రస్తావించారు. లాలూ ప్రసాద్ యాదవ్ రైల్వే మంత్రిగా ఉన్న సమయంలో ఐఆర్‌సీటీసీ స్కామ్ జరిగింది.
ఇది కూడా చదవండి: Delhi: దీపావళి నాడు ఢిల్లీలో భారీ దాడులకు ఐసిస్ ప్లాన్.. వెలుగులోకి సంచలన విషయాలు
బీహార్ అసెంబ్లీ ఎన్నికలు రెండు విడతలు జరుగుతున్నాయి. మొత్తం 243 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. నవంబర్ 6, 11 తేదీల్లో పోలింగ్ జరగనుంది. ఎన్నికల ఫలితాలు మాత్రం నవంబర్ 14న విడుదల కానున్నాయి. ఇదిలా ఉంటే నేటి నుంచి నాలుగు రోజుల పాటు బీహార్‌లో ఛత్ పండుగ జరగనుంది. ఈ వేడుకల కోసం రాష్ట్రం బయట ఉన్నవారంతా గ్రామాలకు చేరుకుంటున్నారు. దీంతో రైళ్లు, బస్సులు, వాహనాలు ఫుల్ రష్‌గా ఉంటున్నాయి.
ఇది కూడా చదవండి: Maharashtra: డాక్టర్ ఆత్మహత్య కేసులో సంచలన విషయాలు.. ఓ ఎంపీ ఏం చేశాడంటే..!