UN Security Council: ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి(యూఎన్ఎస్‌సీ) సంస్కరణపై మరోసారి భారత్ గళం విప్పింది. భద్రతా మండలి సంస్కరణలు చేపట్టాలని కోరింది. ఐరాసలో శాశ్వత ప్రతినిధి రుచిక కాంబోజ్ శనివారం న్యూయార్క్‌లో జరిగిన 78వ సెషన్ అనధికార సమావేశంలో యూఎన్ఎస్‌సీ సంస్కరణ ఆవశ్యతను ఎత్తి చూపారు. అర్ధశతాబ్ధంకి పైగా వీటిపై చర్యలు కొనసాగుతున్నాయని, ప్రపంచం మరియు భవిష్యత్ తరాలు ఇకపై వేచి ఉండలేవని అన్నారు.
Read Also: Indonesia : ఇండోనేషియాలో వర్ష బీభత్సం.. 19మంది మృతి.. నిరాశ్రయులైన వేలాది మంది
‘‘2000 సంవత్సరంలో జరిగిన మిలీనియం సమ్మిట్‌లో ప్రపంచ నాయకులు భద్రతా మండలి అన్ని అంశాలపై సమగ్ర సంస్కరణను సాధించడానికి ప్రయత్నాలను ముమ్మరం చేయాలని నిర్ణయించాయి, దాదాపుగా పావు శతాబ్ధం గడిచింది. ప్రపంచం మరియు మన భవిష్యత్ తరాలు ఇక వేచి ఉండలేవు. వారు ఇంకెంత కాలం వేచి ఉండాలి..?’’ అని కాంబోజ్ ప్రశ్నించారు. వచ్చే ఏడాది ఐక్యరాజ్యసమితి 80వ వార్షికోత్సం సెప్టెంబర్‌లో జరగనున్న కీలకమైన శిఖరాగ్ర సమావేశం వంటి కీలక సందర్భాలను ప్రస్తావిస్తూ.. సంస్కరణలను చేపట్టాలని సూచించారు.
యూఎన్ భద్రతా మండలిలో శాశ్వత సభ్య దేశాలకు మాత్రమే పరిమితం చేయడం వల్ల దాని కూర్పు అసమానతలను పెంచే ప్రమాదం ఉందని ఆమె అన్నారు. భారతదేశం సహా G-4 సభ్యదేశాలైన బ్రెజిల్, జపాన్, జర్మనీ, 193 సభ్యదేశాల అభిప్రాయాల వైవిధ్యం ప్రతిబింబించే ప్రాముఖ్యతను రచికా కాంబోజ్ నొక్కి చెప్పారు. కౌన్సిల్‌లో శాశ్వత సభ్యదేశంగా ఉన్న యునైటెడ్ కింగ్‌డమ్ భారత్‌కి మద్దతు తెలిపింది. శాశ్వత సభ్య దేశాల్లో అమెరికా, ఫ్రాన్స్, రష్యాలు భారత్‌కి మద్దతు తెలుపుతుండగా.. చైనా మాత్రం ఎప్పటికప్పుడు అడ్డుపుల్లలు వేస్తోంది.