Rajnath Singh: కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో విధించిన ‘ఎమర్జె్న్సీ’పై రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏఎన్ఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆనాటి రోజులను గుర్తు చేసుకుని భావోద్వేగానికి గురయ్యారు. తన తల్లి బ్రెయిన్ హెమరేజ్‌తో మరణిస్తే అంత్యక్రియలకు కూడా వెళ్లలేకపోయానని అన్నారు. ‘‘ఎమర్జెన్సీ సమయంలో మా అమ్మ అంత్యక్రియలకు కూడా హాజరుకావడానికి నాకు పెరోల్ ఇవ్వలేదు. ఇప్పుడు ఇదే కాంగ్రెస్ మమ్మల్ని నియంతలుగా పిలుస్తోంది’’ అని అన్నారు.
తన తల్లి అనారోగ్యంతో 27 రోజుల పాటు ఆస్పత్రిలో ఉన్నా, ఆమె చివరి రోజుల్లో నేను ఆమెను కలవలేకపోయానని రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నియంతృత్వంతో వ్యవహిస్తుందని కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు ఆరోపిస్తున్న సమయంలో ఆయన ఎమర్జెన్సీ నాటి విషయాలను వెల్లడించారు. ఎమర్జెన్సీ ద్వారా నియంతృత్వాన్ని విధించిన వ్యక్తులు మాపై నియంతృత్వం అని నిందలు వేస్తున్నారని అన్నారు. 1975లో కాంగ్రెస్ విధించిన ఎమర్జెన్సీ కాలంలో 18 నెలల పాటు జైలులో ఉణ్న విషయాన్ని గుర్తు చేసుకున్నారు.
Read Also: Gujarat: బౌద్ధం వేరే మతం, హిందువులు మతం మారాలంటే అనుమతి తప్పనిసరి..
చైనా సరిహద్దుల్లో యథాతథ స్థితిని పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ మేనిఫెస్టోపై రాజ్‌నాథ్ సింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్రమోడీ పాలనలో మనదేశంలోని ఒక్క అంగుళం భూమి కూడా వదులుకోమని దేశ ప్రజలకు బీజేపీ హామీ ఇస్తోందని ఆయన అన్నారు. ‘‘ కాంగ్రెస్ పాలనలో ఎన్ని వేల చ.కి.మీ భూమి చైనా ఆధీనంలోకి వెళ్లిందనేదానిపై నేను వ్యాఖ్యానించడానికి ఇష్టపడటం లేదు. కానీ, నేను దేశ ప్రజలకు హామీ ఇవ్వాలని అనుకుంటున్నాను. ప్రధాని మోడీ నేతృత్వంలోని ప్రభుత్వంలో మన భూమిలోని ఒక్క అంగుళాన్ని కూడా ఎవరూ స్వాధీనం చేసుకోలేరు’’ అని ఆయన అన్నారు.
పాకిస్తాన్ అసమర్థంగా ఉంటే, ఉగ్రవాదాన్ని నిర్మూలించడంలో భారత్ సిద్ధంగా ఉందని, ఉగ్రవాదంతో భారత్‌ని అస్థిరపరచాలని అనుకుంటే పాకిస్తాన్ పర్యవసానాలను ఎదుర్కోవాల్సి వస్తుందని రాజ్ నాథ్ హెచ్చరించారు. ఉగ్రవాదాన్ని అరికట్టే సామర్థ్యం మాకు లేదని పాకిస్తాన్ భావిస్తే, భారత్ సాయం తీసుకోవచ్చని అన్నారు. భారత సరిహద్దుల్లో ఉగ్రవాద కార్యకలాపాలు సాగించేందుకు మేం అనుమతించమని, దాన్ని అరికట్టేందుకు అన్ని విధాలా కృషి చేస్తామని రాజ్‌నాథ్ అన్నారు.