Rajasthan Woman Tortured By In Laws After She Failed In Virginity: ఈ ఆధునిక ప్రపంచంలో ఇప్పటికీ కొన్ని చోట్ల విచిత్రమైన దురాచారాలు కొనసాగుతూనే ఉన్నాయి. అందునా.. అమ్మాయిల విషయంలోనే చాలా కఠినంగా వ్యవహరిస్తున్నారు. అమ్మాయిలన్నాక ఇలాగే ఉండాలి, ఈ పనులే చేయాలి, హద్దులు మీరకూడదంటూ.. పంజరంలో పావురాన్ని బంధించినట్టు వారిపై ఎన్నో ఆంక్షలు విధిస్తుంటారు. ఒకవేళ అనుకోకుండా ఏదైనా తప్పు జరిగిపోతే.. ఇక అంతే సంగతులు. అత్యంత దారుణంగా హింసిస్తుంటారు. తాజాగా అలాంటి ఘటనే ఒకటి వెలుగు చూసింది. కన్యత్వ పరీక్షల్లో ఫెయిల్ అయ్యిందని, ఓ అమ్మాయిని అత్తింటివారు చితకబాదారు. అంతటితో ఆగకుండా.. పంచాయితీ పెట్టించి, వధువు కుటుంబానికి రూ. 10 లక్షల జరిమానా విధించేలా చేశారు. ఈ ఘటన రాజస్థాన్‌లోని బిల్వారా జిల్లా బాగోర్‌లో జరిగింది. ఆ వివరాల్లోకి వెళ్తే..
మే 11వ తేదీన బాగోర్‌కు చెందిన ఓ అమ్మాయికి, అదే ప్రాంతానికి చెందిన ఒక వ్యక్తితో వివాహమైంది. అయితే.. ఈ ప్రాంతంలో కన్యత్వ పరీక్షలు నిర్వహించే ఒక దురాచారం ఉంది. స్థానికంగా దీనిని కుకుడీ ఆచారం అని అంటారు. ఈ ఆచారం ప్రకారం.. అమ్మాయికి పెళ్లికి ముందు తమ కన్యత్వం కోల్పోకూడదు. ఒకవేళ కన్యత్వం కోల్పోయినా, ఆ విషయాన్ని రహస్యంగా దాచి ఉంచినా.. వారిని తీవ్రంగా శిక్షిస్తారు. ఆ బాధితురాలికి కూడా.. ఈ కన్యత్వ పరీక్షలు నిర్వహించారు. అయితే.. ఆమె ఇందులో విఫలమైంది. దీంతో.. భర్త సహా అత్తింటివారు ఆమెను చితకబాదారు. కన్యత్వం కోల్పోయాక, ఏ ధైర్యంతో పెళ్లి చేసుకున్నావ్? తమ సాంప్రదాయాల్ని మంటలో కలిపావంటూ ఆమెను హింసించారు. తమ కుటుంబ పరువు తీశావంటూ ఇంటి నుంచి వెళ్లగొట్టారు. అంతేకాదు.. మే 31వ తేదీన గ్రామ పెద్దల సమక్షంలో ఈ విషయంపై పంచాయితీ పెట్టారు.
ఈ పంచాయితీలో.. పెళ్లికి ముందు తనపై అత్యాచారం జరిగిందని, పొరుగింట్లో ఉండే యువకుడే తనపై అత్యాచారం చేశాడని, ఈ సంఘటనపై తాను పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు కూడా చేశానని బాధితురాలు చెప్పింది. అంతే తప్ప, తానేమీ ఆచారాన్ని ధిక్కరించి పరాయి మగాడితో శారీరక సంబంధం పెట్టుకోలేదని వెల్లడించింది. అయినా అత్తింటివారు, పంచాయితీ పెద్దలు ఆమె ఆవేదనని పట్టించుకోలేదు. కన్యత్వ పరీక్షల్లో ఫెయిల్ అయినందుకు.. రూ. 10 లక్షల జరిమానా చెల్లించాల్సిందేనని పెద్దలు తీర్మానించారు. దీంతో ఆమె పోలీసుల వద్దకు వెళ్లి తన గోడు వెళ్లబోసుకోగా.. వాళ్లు రంగంలోకి దిగి భర్త, అత్త, మామ, ఇతరులపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.