Rahul Gandhi: అమెరికా పర్యటనలో ఉన్న రాహుల్ గాంధీ చేస్తున్న వ్యాఖ్యలు ఇంటాబయట వివాదాస్పదమవుతున్నాయి. సిక్కులపై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై ఇప్పటికే బీజేపీ తీవ్రంగా విరుచుకుపడుతోంది. మరోవైపు రిజర్వేషన్ల రద్దు వ్యాఖ్యలు కూడా దుమారాన్ని రేపుతున్నాయి. తాజాగా అమెరికా చట్టసభ సభ్యురాలు, భారత వ్యతిరేకి, పాకిస్తాన్ మద్దతురాలిగా పేరున్న ఇల్హాన్ ఒమర్‌తో రాహుల్ గాంధీ భేటీ కావడంపై కూడా విమర్శలు వస్తున్నాయి.
ఇదిలా ఉంటే, సిక్కుల గురించి రాహుల్ చేసిన వ్యాఖ్యలకు ఖలిస్తాన్ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూ మద్దతు తెలిపాడు. ‘‘భారతదేశంలో సిక్కులు తలపాగా లేదా కడాను ధరించడానికి అనుమతిస్తారా, గురుద్వారాలను సందర్శించడానికి అనుమతిస్తారా అనే పోరాటం జరుగుతోంది’’ అని రాహుల్ గాంధీ అమెరికా పర్యటనలో అన్నారు. రాహుల్ గాంధీవి ‘‘ధైర్యమైన మరియు మార్గదర్శక’’ వ్యాఖ్యలు, ప్రత్యేక ఖలిస్తానీ దేశ డిమాండ్‌ని సమర్థిస్తాయి అని పన్నూ అన్నారు.
Read Also: IPS Ashna Success Story: మోడల్ నుంచి ఐపీఎస్.. అందమైన పోలీస్ అధికారిణి సక్సెస్ స్టోరీ..
‘‘భారతదేశంలో సిక్కులకు అస్తిత్వ ముప్పు గురించి గాంధీ చేసిన ప్రకటన సాహసోపేతమైనది మరియు మార్గదర్శకమైనది మాత్రమే కాదు, 1947 నుండి భారతదేశంలోని వరుస పాలనలలో సిక్కులు ఎదుర్కొంటున్న వాస్తవ చరిత్రని తెలియజేస్తుంది’’ అని పన్నూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. రాహుల్ వ్యాఖ్యలు సిక్కుల మాతృభూమి ఖలిస్తాన్ స్థాపించడానికి పంజాబ్‌లో స్వాతంత్య్ర ప్రజాభిప్రాయ సేకరణ కోసం సిఖ్స్ ఫర్ జస్టిస్(ఎస్ఎఫ్‌జే) వైఖరిని కూడా ధృవీకరిస్తుందని పన్నూ చెప్పాడు.
రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై కేంద్రమంత్రి హర్దీప్ సింగ్ పూరి మండిపడ్డారు. 1984లో సిక్కు వ్యతిరేక అల్లర్లు ప్రారంభించింది కాంగ్రెస్ పార్టీనే అని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే సిక్కులపై మారణకాండ జరిగిన విషయం రాహుల్ గాంధీకి గుర్తులేదా..? అని బీజేపీ ప్రశ్నించింది. ఈ 1984 అల్లర్లలో 3000 మంది మరణించారు. నా స్నేహితులు చాలా మంది తలపాగాలను తొలగించారు, దాడికి భయపడి క్లీన్ షేవ్ చేసుకున్నారని కేంద్రమంత్రి చెప్పారు.