Ram Mandir: రాహుల్ గాంధీని ఉద్దేశిస్తూ కాంగ్రెస్ మాజీ నేత ఆచార్య ప్రమోద్ కృష్ణం మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే సుప్రీంకోర్టు రామమందిర తీర్పును రద్దు చేస్తానని రాహుల్ గాంధీ శపథం చేశాడని ఆయన సోమవారం అన్నారు. రామమందిర నిర్మాణానికి మార్గం సుగమం చేసిన సుప్రీంకోర్టు తీర్పును కొట్టివేయడానికి ‘‘సూపర్ పవర్ కమిషన్’’ ఏర్పాటు చేయాలని రాహుల్ గాంధీ తన సన్నిహితులతో జరిగిన సమావేశంలో చెప్పారని ప్రమోద్ కృష్ణం ఆరోపించారు.
‘‘ నేను 32 ఏళ్ల కాంగ్రెస్‌లో ఉన్నా. రామ మందిర నిర్ణయం వచ్చినప్పుడు, అమెరికాలోని తన శ్రేయోభిలాషి నుంచి సలహా పొందిన తర్వాత రాహుల్ గాంధీ తన సన్నిహితులతో జరిగిన సమావేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సూపర్ పవర్ కమీషన్ ఏర్పాటు చేసి షాబానో నిర్ణయాన్ని తోసిపుచ్చినట్లే, రామ మందిర నిర్ణయాన్ని తోసిపుచ్చుతుందని చెప్పారు’’ అని ఆచార్య ప్రమోద్ కృష్ణం అన్నారు.
Read Also: China: చైనాలో మళ్లీ మహమ్మారి వ్యాప్తి చెందుతుందా..? ఆసుపత్రుల్లో ఐసీయూ పడకలను పెంచాలని సిఫార్సు
2019లో సుప్రీంకోర్టు తీర్పు తర్వాత అయోధ్యలో రామమందిర నిర్మాణానికి మార్గం సుగమం అయింది. ఈ ఏడాది జనవరి 22న రామమందిరంలో ప్రాణప్రతిష్ట వేడుకలతో ప్రారంభమైంది. ఛత్తీస్‌గఢ్ కీలక కాంగ్రెస్ నేత రాధిక ఖేరా రాజీనామా చేయడంపై ఆయన మాట్లాడుతూ జూన్ 4 తర్వాత చాలా మంది నాయకులు కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వస్తారని అన్నారు. దేశభక్తులు, రామభక్తులు, సనాతనాన్ని నమ్ముకున్న వారెవరు కాంగ్రెస్ పార్టీలో ఉండలేరని, ప్రస్తుతం ఈ జాబితా చాలా పెద్దగా ఉందని, జూన్ 4 తర్వాత చాలా మంది సీనియర్ నాయకులు పార్టీని వీడేందుకు సిద్ధంగా ఉన్నారని ఆయన చెప్పారు. పాకిస్తాన్ పాటలు పాడేవారు మాత్రమే కాంగ్రెస్‌లో ఉంటారని అన్నారు.
కాంగ్రెస్ పార్టీకి రాధికా ఖేరా నిన్న రాజీనామా చేశారు. తాను అయోధ్యలో రామమందిర దర్శనానికి వెళ్లడం పార్టీకి నచ్చలేదని, దాంతో తనను వేధించారని, దీనిపై ముఖ్యనేతలకు చెప్పినా కూడా పట్టించుకోలేదని ఆమె ఆరోపించారు. ఛత్తీస్‌గఢ్ కాంగ్రెస్ నాయకుడు సుశీల్ ఆనంద్ షుఖా తన పట్ల అనుచితంగా ప్రవర్తించారని, దుర్భాషలాడాడని ఆమె చెప్పింది.