Rahul Gandhi: కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర మధ్యప్రదేశ్‌లో కొనసాగుతోంది. ఈ సందర్భంగా పలువురు సెలబ్రెటీలు ఆయనకు మద్దతుగా ఈ యాత్రలో పాల్గొంటున్నారు. తాజాగా ప్రముఖ ప్రొఫెషనల్ బాక్సర్ విజేందర్ సింగ్ రాహుల్ గాంధీ పాదయాత్రలో పాల్గొని ఆయనతో పాటు కలిసి నడిచాడు. ఈ సందర్భంగా మీసం తిప్పాలని విజేందర్ సింగ్ కోరాడు. దీంతో అతడి వినతి మేరకు విజేందర్‌తో కలిసి రాహుల్ గాంధీ మీసం మెలేశారు. ఈ ఫొటోను రాహుల్ గాంధీ తన ట్విటర్‌లో షేర్ చేశారు. ‘మీసంపై చేయి, చేతుల్లో బలం, దృఢ సంకల్పం, ధైర్యమైన అడుగులు’ అని ఈ ఫోటోకు క్యాప్షన్ ఇచ్చారు. రాహుల్ షేర్ చేసిన ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
मूछों पर ताव, बाज़ुओं में दम,
फौलादी इरादे, जोशीले कदम! pic.twitter.com/RzRAvv0sLm— Rahul Gandhi (@RahulGandhi) November 25, 2022
అటు శుక్రవారం భారత్ జోడో యాత్రకు సంబంధించి బీజేపీ నేత అమిత్ మాల్వియా తన ట్విట్టర్ ఖాతాలో ఒక వీడియోను షేర్ చేశారు. ‘రాహుల్ గాంధీ నిర్వహించే భారత్ జోడో యాత్రలో రిచా చద్దా పాల్గొంటున్నట్లు ప్రకటన వచ్చిన అనంతరం జరిగిన సంఘటన ఇది. వీడియో చివరి వరకు సరిగ్గా చూడండి. పాకిస్తాన్ జిందాబాద్ అనే నినాదాలు వినిపిస్తాయి. ఈ వీడియోను కాంగ్రెస్ ఎంపీ పోస్ట్ చేశారు. అయితే ఇందులో పాకిస్తాన్ అనుకూల నినాదాలు ఉన్నాయని గుర్తించిన వెంటనే డిలీట్ చేసుకున్నారు. ఇది కాంగ్రెస్ పార్టీ అసలు నిజస్వరూపం’ అని ట్వీట్ చేశారు. దీంతో బీజేపీ నేత అమిత్ మాల్వియా ఆరోపణలపై కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ బదులిచ్చారు. పూర్తిగా చెత్తతో నిండిపోయిన బీజేపీ చెత్త డిపార్ట్మెంట్ నుంచి ఎడిటింగ్ చేసి వచ్చిన వీడియో ఇది. భారత్ జోడో యాత్ర చాలా విజయవంతంగా కొనసాగుతోంది. దాన్ని చూసి ఓర్వలేకే బీజేపీ ఇలాంటి చిల్లర పనులకు దిగుతోంది. దీనిపై మేము చట్టబద్ధ చర్యలు తీసుకుంటాం. అలాగే బీజేపీకి వార్నింగ్ ఇస్తున్నాం. మేము కూడా ఇలాంటి ట్రిక్స్‌కు సిద్ధమయ్యే ఉన్నాం. వాటి రుచి మీకు తొందరలోనే చూపిస్తాం’ అంటూ జైరాం రమేష్ ట్వీట్ చేశారు.
Read Also: Manish Pandey: అప్పుడు నా కెరీర్ నాశనం చేశారు.. ఇప్పుడు శాంసన్ కెరీర్ నాశనం చేస్తున్నారు