states Passes Resolution Backing Rahul Gandhi As Congress Chief: కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీనే చేపట్టాలనే పలు రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఏఐసీసీ అధ్యక్ష ఎన్నికలు దగ్గపడుతున్నా కొద్ది మళ్లీ రాహుల్ గాంధీనే మరోసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టాలని డిమాండ్లు ఎక్కువ అవుతున్నాయి. ఇప్పటికే రాజస్థాన్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు రాహుల్ గాంధీనే మళ్లీ కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టాలని తీర్మానం చేశారు. తాజాగా ఛత్తీస్‌గఢ్ కాంగ్రెస్ కమిటీ కూడా రాహుల్ గాంధీనే అధ్యక్ష పదవిని చేపట్టాలని తీర్మానం చేసింది. రాహుల్ గాంధీ మరోసారి తన నిర్ణయాన్ని పునరాలోచించాలని ఛత్తీస్‌గఢ్ సీఎం భూపేష్ బఘేల్ ఆదివారం అన్నారు.
ఇప్పటికే రెండు రాష్ట్రాల కాంగ్రెస్ కమిటీలు రాహుల్ గాంధీనే అధ్యక్ష బాధ్యతలను చేపట్టాలని తీర్మానాలు చేశాయని.. మరిన్ని రాష్ట్రాల నుంచి కూడా ఇదే విధంగా నిర్ణయాలు వస్తే రాహుల్ గాంధీ తప్పకుండా తన నిర్ణయాన్ని పునరాలోచించుకోవాలని ఆయన అన్నారు. రెండు రాష్ట్రాల్లోని కాంగ్రెస్ కమిటీలు కూడా ఏకగ్రీవంగా రాహుల్ గాంధే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కావాలని తీర్మానాలు చేశాయి. రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలను చేపట్టేందుకు సుముఖంగా లేరని తెలుస్తోంది. ఈ సారి కాంగ్రెస్ పార్టీకి గాంధీయేతర కుటుంబం నుంచే అధ్యక్షుడు వస్తాడనే వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీ బిజీగా ఉన్నారు. ఐదు నెలల పాటు 3570 కిలోమీటర్ల మేర పాదయాత్ర జరగనుంది. కన్యాకుమారి నుంచి ప్రారంభం అయిన ఈ యాత్ర 12 రాష్ట్రాలు, 2 కేంద్ర పాలిత ప్రాంతాల మీదుగా సాగి కాశ్మీర్ లో ముగుస్తుంది.
Read Also: Perni Nani: చిరంజీవి నిఖార్సైన నాయకుడు.. పవన్ వీకెండ్ నాయకుడు
ఇదిలా ఉంటే అక్టోబర్ 17న కాంగ్రెస్ పార్టీకి అధ్యక్ష ఎన్నికలు జరుగుతాయని.. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ నిర్ణయించింది. అక్టోబర్ 19న ఓట్ల లెక్కింపు జరగనుంది. ఇందుకోసం ఇప్పటికే అన్ని రాష్ట్రాల్లో ఏర్పాట్లు కూడా ప్రారంభం అయ్యాయి. సెప్టెంబర్ 22న ఎన్నికకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల కానుంది. సెప్టెంబర్ 24 నుంచి సెప్టెంబర్ 30 వరకు నామినేషన్లను దాఖలు చేసేందుకు తేదీలను ఖరారు చేశారు. నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ అక్టోబర్ 8 అని.. అక్టోబర్ 17న ఎన్నిక, అక్టోబర్ 19న ఓట్ల లెక్కింపు జరగనుంది. అంతకు ముందు 2017లో కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన రాహుల్ గాంధీ.. 2019 వరకు అధ్యక్ష పదవిలో కొనసాగారు. 2019లో మరోసారి కాంగ్రెస్ పార్టీ దారుణంగా ఓడిపోవడంతో అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు.