కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఢిల్లీలోని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కార్యాలయానికి చేరుకున్నారు.. ఏఐసీసీ కార్యాలయం నుంచి ర్యాలీ ఈడీ ఆఫీసుకు వెళ్లారు.. నేషనల్ హెరాల్డ్ కేసుకు సంబంధించి కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ఢిల్లీలోని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కార్యాలయానికి హాజరయ్యారు. ఆయన వెంట ఆయన సోదరి, పార్టీ అధినేత్రి ప్రియాంక గాంధీ వాద్రా ఉన్నారు. అయితే, ర్యాలీలో పాల్గొన్న నేతలను అడ్డుకుని అరెస్ట్ చేశారు పోలీసులు.. ఇక, ఈడీ కార్యాలయంలో రాహుల్ గాంధీ విచారణ ప్రారంభమైంది… ముగ్గురు ఈడీ అధికారులు రాహుల్‌ను ప్రశ్నిస్తున్నట్టుగా తెలుస్తోంది. ప్రివెన్షన్ మనీ లాండరింగ్ యాక్ట్ (PML) సెక్షన్ 50 కింద నేషనల్ హెరాల్డ్ కేసులో రాహుల్ గాంధీ స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నారు ఈడీ అధికారులు.
మరోవైపు.. ఈ నెల 23వ తేదీన సోనియా గాంధీ ఈడీ ముందుకు వచ్చే అవకాశం ఉంది.. ప్రస్తుతం ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.. ఇక, సోనియా, రాహుల్‌కి ఈడీ నోటీసులు, ప్రశ్నించడంపై కాంగ్రెస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. దేశవ్యాప్తంగా సత్యాగ్రహ దీక్షలకు పిలుపునిచ్చింది కాంగ్రెస్ పార్టీ.. ఢిల్లీతో పాటు దేశవ్యాప్తంగా ఆందోళనలకు పిలుపునిచ్చారు.. రాహుల్ గాంధీకి కాంగ్రెస్ అగ్రనాయకులు, పార్లమెంట్ సభ్యులు, సీడబ్ల్యూసీ మెంబర్లు మద్దతు తెలుపుతూ ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. వారిని పోలీసులు అరెస్ట్ చేశారు.. 2013లో బీజేపీ నేత సుబ్రమణ్య స్వామి వేసిన పిటిషన్ ఆధారంగా ఈడీ విచారణ జరుపుతోన్న విషయం తెలిసిందే. ఇక, హైదరాబాద్‌లో కాంగ్రెస్ పార్టీ ఆందోళన కార్యక్రమానికి పోలీసులు అనుమతి ఇచ్చారు..
రాహుల్ గాంధీ నివాసం వెలుపల పోలీసులు మోహరించారు, దేశ రాజధానిలోని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కార్యాలయం వెలుపల కూడా అదనపు భద్రతా బలగాలను మోహరించారు. ఈరోజు తెల్లవారుజామున కాంగ్రెస్ కార్యకర్తలు ప్లకార్డులు పట్టుకుని రాహుల్ గాంధీకి మద్దతుగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దేశ రాజధాని ఢిల్లీలోని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో ‘రాహుల్ గాంధీ జిందాబాద్, జిందాబాద్’ పాట ప్రతిధ్వనించింది. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్న పలువురు కాంగ్రెస్ కార్యకర్తలను పార్టీ ప్రధాన కార్యాలయం దగ్గరే నిర్బంధించారు పోలీసులు.