PM Modi: పాకిస్తాన్‌పై భారత్ ‘‘ఆపరేషన్ సిందూర్’’ నిర్వహించిన తర్వాత తొలిసారిగా ప్రధాని నరేంద్రమోడీ గురువారం రాజస్థాన్ బహిరంగ సభలో పాల్గొన్నారు. బికనీర్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో పాకిస్తా్న్‌పై మోడీ విరుచుకుపడ్డారు. ముఖ్యంగా భారత్, పాకిస్తాన్ వైమానిక స్థావరాలపై జరిపిన దాడుల్ని మోడీ హైలెట్ చేశారు. పాకిస్తాన్‌లోని రహీం యార్ ఖాన్ ఎయిర్‌బేస్‌కు జరిగిన విధ్వంసం గురించి మాట్లాడుతూ.. ఆ ఎయిర్‌బేస్ ‘‘ఐసీయూ’’లో ఉందని అన్నారు.
ప్రధాని మోడీ మాట్లాడుతూ..‘‘ నేను ఢిల్లీ నుండి ఇక్కడికి వచ్చినప్పుడు, బికనీర్‌లోని నల్ విమానాశ్రయంలో దిగాను. పాకిస్తాన్ కూడా దీనిని లక్ష్యంగా చేసుకోవడానికి ప్రయత్నించింది కానీ వారు ఈ వైమానిక స్థావరాన్ని దెబ్బతీయడంలో విఫలమయ్యారు. సరిహద్దుకు అవతలి వైపున రహీం యార్ ఖాన్ వైమానిక స్థావరం ఉంది. ఇది ఐసియులో ఉంది. ఇది ఎప్పుడు తెరుచుకుంటుందో తెలియదు? భారత దళాలు ఈ వైమానిక స్థావరాన్ని ధ్వంసం చేశాయి.’’ అని అన్నారు.
Read Also: Himanta Biswa Sarma: మీకు రెండు ‘‘చికెన్ నెక్’’లు ఉన్నాయి.. బంగ్లాదేశ్‌కి హెచ్చరిక..
‘‘ ఈ నేలపై ప్రమాణం చేస్తున్నా, భారతదేశాన్ని ఎవరి ముందు పడనివ్వను’’ అని అన్నారు. పవిత్ర సిందూరాన్ని తుడిచిపెట్టిన వారి అంతు చూశాము, భారతదేశ రక్తాన్ని చిందించిన వారు ఇప్పుడు మూల్యం చెల్లించుకున్నారని, భారత్ మౌనంగా ఉంటుందని భావించిన వారు ఇప్పుడు దాక్కున్నారని, తమ ఆయుధాల గురించి గొప్పలు చెప్పుకున్న వారు ఇప్పుడు శిథిలాల కింద ఖననం చేయబడ్డారని ప్రధాని మోడీ అన్నారు. ఆపరేషన్ సిందూర్ ప్రతీకార చర్య కాదని, న్యాయం యొక్క కొత్త రూపం అని నొక్కి చెబుతూ, ఇది కేవలం ఆగ్రహాన్ని వ్యక్తపరచడమే కాకుండా భారతదేశం యొక్క అచంచలమైన బలం మరియు దృఢ సంకల్పాన్ని ప్రదర్శించిందని ఆయన వ్యాఖ్యానించారు.
ఆపరేషన్ సిందూర్‌లో భాగంగా భారత్ వైమానిక దళం పాకిస్తాన్‌లోని 11 ఎయిర్‌బేస్‌ను ధ్వంసం చేసింది. ముఖ్యంగా రావల్పిండిలోని నూర్ ఖాన్ ఎయిర్‌బేస్‌తో సహా రఫికీ, సర్గోదా, జకోబాబాద్, కరాచీ, స్కర్దు, రహీం యార్ ఖాన్ ఇలా పలు వైమానిక స్థావరాలను ధ్వంసం చేసింది. ఈ దాడి తర్వాతే పాకిస్తాన్ కాళ్ల బేరానికి వచ్చింది.