Lalu Prasad Yadav: లాలూ ప్రసాద్ యాదవ్‌పై ఆయన బావమరిది, మాజీ రాజ్యసభ ఎంపీ సుభాష్ యాదవ్ గురువారం రోజు సంచలన ఆరోపణలు చేశారు. ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ బీహార్‌ని పాలిస్తున్న సమయంలో కిడ్నాప్‌లకు పాల్పడే ముఠాలతో సంబంధాలు కలిగి ఉన్నారని ఆరోపించారు. లాలూ భార్య రబ్రీదేవీకి సుభాష్ యాదవ్ సొంత తమ్ముడు.
‘‘కిడ్నాప్‌ల వెనుక నా హస్తం ఉందని వారు ఆరోపిస్తున్నారు. ప్రజలను అపహరించి విడుదల చేయాలని ఆదేశించేది వారే’’ అని సుభాష్ యాదవ్ ఆరోపించారు. నాకు వ్యతిరేకంగా ఏదైనా ఆధారాలు ఉంటే, దాణా కుంభకోణంలో ప్రమేయం ఉన్న లాలూ ప్రసాద్ యాదవ్ లాగే నేను కూడా జైలుకు వెళ్లే వాడినని చెప్పారు. అయితే, ఈ వ్యాఖ్యలపై రబ్రీదేవీ మరో సోదరుడు సాధు యాదవ్ మాట్లాడుతూ.. సుభాష్ అర్థ లేని మాటలు మాట్లాడుతున్నాడని, అలా మాట్లాడటానికి అతడికి వేరే పార్టీల నుంచి సాయం అందినట్లు తెలుస్తోందని ఆరోపించాడు.
‘‘సుభాష్ అన్ని రకాల సందేహాస్పద కార్యకలాపాల్లో పాల్గొనేవాడు. కిడ్నాపర్లతో అతనికి సంబంధాలు ఉన్నాయని నేను అనుమానిస్తున్నాను.’’ అని చెప్పాడు.
Read Also: IPL 2025: ఐపీఎల్ 2025 తొలి మ్యాచ్ ఆ టీమ్స్ మధ్యనే.. ఎస్‌ఆర్‌హెచ్ మ్యాచ్ ఎప్పుడంటే?
సాధు-సుభాష్ యాదవ్‌లపై తరుచుగా ఎన్డీయే కూటమి విమర్శలు గుప్పిస్తుంది. వీరిద్దరు లాలూ కుమార్తె మీసా భారతి వివాహానికి పాట్నాలోని కార్ షోరూం నుంచి వాహనాలను దోచుకెళ్లినట్లు ఆరోపణలు ఉన్నాయి. 1999లో వాహనాలు దోచుకెళ్లినట్లు సుభాష్ యాదవ్ అంగీకరించారు. లాలూ సూచన మేరకే దోపిడీ చేశామని చెప్పాడు. ‘‘నిజానికి, లాలూ ప్రవర్తించకుండా నిరోధించడానికి ప్రయత్నించింది నేనే. కానీ ఆ రోజుల్లో, అతను అధికారంలో మత్తులో ఉన్నాడు మరియు ఎవరి మాట వినలేదు’’ అని ఆరోపించాడు.
తన మేనల్లుడు తేజస్వీ యాదవ్ గురించి మాట్లాడుతూ… ఆయన సీజనల్ రాజకీయ నాయకుడని అన్నారు. ఈ ఎడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి ఘన విజయం సాధిస్తుందని, 243 సీట్లలో 200కంటే ఎక్కవ సీట్లు వస్తాయని జోస్యం చెప్పారు. ఈ వ్యాఖ్యలపై ఆర్జేడీ ప్రతినిధి శక్తి యాదవ్ స్పందిస్తూ.. మా పార్టీ అధ్యక్షుడిపై కావాలనే విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. ఢిల్లీలో బీజేపీ సాధించిన విజయం, బీహార్‌పై ఎలాంటి ప్రభావం చూపించదని అన్నారు.