Bangladesh: బంగ్లాదేశ్‌లోని కవి, బహుభాషావేత్త, నోబెల్ గ్రహీత రవీంద్రనాథ్ ఠాగూర్ పూర్వీకుల ఇంటిపై మతోన్మాదులు దాడులు చేశారు. సిరాజ్‌గంజ్ జిల్లాలోని ప్రస్తుతం మ్యూజియంగా ఉన్న ఇంటిపై దాడి జరిగింది. ఆదివారం ఒక సందర్శకుడు, మ్యూజియం సిబ్బందికి పార్కింగ్ ఫీజు విషయంలో జరిగిన వివాదం తర్వాత, ఒక గుంపు దాడికి పాల్పడింది. సందర్శకుడిని నిర్బంధించిన తర్వాత దాడి జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ సంఘటన ప్రజల్లో ఆగ్రహానికి కారణమైంది. దీంతో ఒక గుంపు ఆవరణలోకి చొరబడి మ్యూజియం, ఆడిటోరియంపై దాడులకు పాల్పడింది.
Read Also: Air India Crash: విషాదం.. అమ్మకు భోజనం తీసుకెళ్లిన కొడుకు మృతి..
అయితే, ఈ ఘటనపై భారతదేశ విదేశాంగ మంత్రిత్వ శాఖ తీవ్ర అసంతృప్తి, ఆందోళన వ్యక్తం చేసింది. “జూన్ 8, 2025న గురుదేవ్ రవీంద్రనాథ్ ఠాగూర్ పూర్వీకుల ఇంటిపై ఒక గుంపు జరిపిన జుగుప్సాకరమైన దాడి మరియు విధ్వంసాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము” అని అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ అన్నారు. ఇటీవల కాలంలో బంగ్లాదేశ్‌లో ఉగ్రవాదం పెరుగుతోందని, ఇది బంగ్లాదేశ్ సంస్కృతి, వారసత్వాన్ని తొలగించడానికి తీవ్రవాదులు క్రమబద్ధంగా చేస్తున్న దాడికి నిదర్శనమని చెప్పారు. నేరస్తులపై ఉగ్రవాదులుగా ముద్రవేసి, కఠినంగా శిక్షించాలని భారత్ కోరింది.