ఉత్తర్ ప్రదేశ్ అల్లర్లలో యోగీ సర్కార్ పట్టుబిగిస్తోంది. అల్లర్లకు కారణం అయిన వారిని వరసగా అరెస్ట్ చేస్తోంది. ఇటీవల బీజేపీ మాజీ అధికార ప్రతినిధి నపుర్ శర్మ మహ్మద్ ప్రవక్తకు వ్యతిరేకంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో దేశవ్యాప్తంగా ముస్లింలు ఆందోళనలను చేశారు. అయితే చాలా వరకు శాంతియుతంగానే నిరసనలు తెలిపినా.. కొన్ని ప్రాంతాల్లో మాత్రం హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా యూపీలోని కాన్పూర్, ప్రయాగ్ రాజ్, సహరాన్ పూర్, హత్రాస్ ఇలా కొన్ని ప్రాంతాల్లో అల్లరి మూకలు విధ్వంసానికి తెరతీశాయి. రాళ్లలో దాడుల చేశారు. దీంతో యోగీ ఆదిత్యనాథ్ సర్కార్ ఈ అల్లర్లపై తీవ్రంగా రియాక్ట్ అయింది. అల్లర్లకు కారణం అయిన వారిని అరెస్ట్ చేస్తూ యోగీ మార్క్ ట్రీట్మెంట్ ఇస్తున్నారు.
ఇప్పటి వరకు అల్లర్లకు కారణమైన 337 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. తొమ్మిది జిల్లాల్లో దాదాపుగా 13 ఎఫ్ఐఆర్ లు నమోదు అయ్యాయి. ఫిరోజా బాద్ లో 18, అంబేద్కర్ నగర్ లో 41, మురాదాబాద్ లో 40, సహరాన్ పూర్ లో 83, ప్రయాగ్ రాజ్ లో 92, హత్రాస్ లో 52, అలీఘడ్ లో 6, జలౌన్ లో 5 మందిని అరెస్ట్ చేశారు. కాన్పూర్ అల్లర్లలో మాస్టర్ మైండ్ అయిన జాఫర్ హయత్ హష్మీని పోలీసులు విచారిస్తున్నారు. అల్లర్లకు ప్రధాన సూత్రధారులుగా ఉన్న సైఫుల్లా, మహ్మద్ నసీమ్, మహ్మద్ ఉమర్ లను పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు. అల్లర్ల వెనక పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా( పీఎఫ్ఐ) హస్తం ఉందని పోలీసులు భావిస్తున్నారు.
అయితే పోలీస్ విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నట్లు తెలుస్తోంది. కాన్పూర్‌లో జరిగిన హింసాకాండలో ప్రధాన నిందితుడు జాఫర్ హయత్ హష్మీ తన సంస్థకు బిల్డర్లు, వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకుల నుండి నిధులు సమకూర్చినట్లు వెల్లడించాడు. మరోవైపు పీఎఫ్ఐ నిధుల వ్యవహారంలో నిందితుల విచారణ కొరకు ఈడీ కాన్పూర్ పోలీసులు సంప్రదించింది. ఇదిలా ఉంటే నిందితుల అక్రమ నిర్మాణాలను యోగీ సర్కార్ బుల్డోజర్లతో కూల్చేస్తోంది.