భారతదేశ రాజకీయ చరిత్రలో మంగళవారం చారిత్రక ఘట్టం చోటుచేసుకుంది. దేశ వ్యాప్తంగా లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి నిర్వహించేందుకు అనువుగా 129వ రాజ్యాంగ సవరణ బిల్లును కేంద్ర ప్రభుత్వం మంగళవారం లోక్‌సభలో ప్రవేశపెట్టింది. కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్‌రామ్ మేఘ్‌వాల్ 129వ రాజ్యాంగ సవరణ బిల్లుతో పాటు, కేంద్ర పాలిత ప్రాంతాల చట్ట సవరణ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టారు. దాదాపు 90 నిమిషాల చర్చ తర్వాత బిల్లుకు అనుకూలంగా 269 మంది, వ్యతిరేకంగా 198 మంది ఓటేశారు. అయితే కేంద్రం నియంతృత్వంగా వ్యవహరిస్తుందని ప్రతిపక్షాలు మండిపడ్డాయి. జాయింట్ పార్లమెంట్ కమిటీకి బిల్లు పంపాలని డిమాండ్ చేశాయి. దీంతో బిల్లును జేపీసీ కమిటీకి పంపాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది.
అయితే ఒకే దేశం-ఒకే ఎన్నికపై నియమించిన జాయింట్ పార్లమెంట్ కమిటీలో కాంగ్రెస్ అగ్ర నేత, వయనాడ్ ఎంపీ ప్రియాంకాగాంధీకి చోటు దక్కినట్లు తెలుస్తోంది. ప్యానెల్‌లో ప్రియాంకను భాగం చేయాలని కాంగ్రెస్ భావిస్తున్నట్లు సమాచారం. ప్రియాంకతో పాటు మనీష్ తివారీకి చోటు లభించనున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. జమిలిపై రాజ్యాంగ సవరణ బిల్లును ఈ కమిటీ అధ్యయనం చేయనుంది.
పార్లమెంట్‌లో ప్రస్తుతం బీజేపీ తర్వాత కాంగ్రెస్ అతిపెద్ద పార్టీగా ఉంది. కాంగ్రెస్ ప్రతిపక్ష పాత్ర పోషిస్తోంది. అయితే జమిలి ఎన్నికల బిల్లు పరిశీలనకు కాంగ్రెస్ నుంచి ప్రియాంకాగాంధీ, మనీష్ తివారీ, రణదీప్ సుర్జేవాలా, సుఖ్‌దేయో భగత్ సింగ్ పేర్లను కాంగ్రెస్ ప్రతిపాదించినట్లు సమాచారం. అయితే ఇండియా కూటమిలో మిత్రపక్షమైన తృణమూల్ కాంగ్రెస్ కూడా పలు పేర్లు ప్రతిపాదించింది. టీఎంసీ నుంచి సాకేత్ గోఖలే, కల్యాణ్ బెనర్జీ పేర్లను ప్రతిపాదించినట్లు సమాచారం. ఫైనల్‌గా కాంగ్రెస్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.