Priyank Kharge: కర్ణాటకలో కాంగ్రెస్ వర్సెస్ ఆర్ఎస్ఎస్ పంచాయతీ కొనసాగుతోంది. ఇటీవల ఆర్ఎస్ఎస్ ర్యాలీల అనుమతులను నిరాకరించడంపై వివాదం మొదలైంది. ఇదిలా ఉంటే, కాంగ్రెస్ నేత, రాష్ట్ర మంత్రి ప్రియాంక్ ఖర్గే గురువారం సంచలన ఆరోపణలు చేశారు. బీజేపీ సీనియర్ నేతల పిల్లలు హస్టల్ విద్యార్థులను ఆర్ఎస్ఎస్ రూట్ మార్చ్‌కు హాజరుకావాలని బలవంతం చేస్తున్నారని ఆరోపించారు. ఇతరులకు వర్తించే చట్టాలు ఆ సంస్థలకు ఎందుకు వర్తించవు అని ప్రశ్నించారు.
Read Also: Hafiz Saeed: భారత్‌కు వ్యతిరేకంగా జిత్తులమారి నక్క హఫీజ్ సయీద్ కొత్త ప్లాన్ ?
‘‘ఆర్ఎస్ఎస్ రూట్ మార్చ్‌తో నాకేం సంబంధం..? వారు చిత్తాపూర్‌ను ప్రతిష్టాత్మకంగా మార్చారు. బీజేపీ నాపై నిందలు వేస్తే ప్రజలు మౌనంగా ఉంటారని వారు అనుకుంటున్నారా..?’’ అని ప్రశ్నించారు. హస్టల్ విద్యార్థుల్ని బలవంతం చేస్తున్నారని తెలిసి తాను ముఖ్యమంత్రికి లేఖ రాశానని ఖర్గే అన్నారు. బెంగళూర్ రోడ్లపై నిరసనలు, ర్యాలీలు నిషేధించాలని హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను ఉటంకిస్తూ.. ఆర్ఎస్ఎస్‌కు ఎందుకు మినహాయింపు ఇచ్చారని ప్రశ్నించారు. బెంగళూర్ రోడ్లపై ర్యాలీలను నిషేధించాలని హైకోర్టు ఉత్తర్వులు ఉన్నాయి, అయినా కూడా ఆర్ఎస్ఎస్ రూట్ మార్చ్ నిర్వహించింది. అందరికీ వర్తించే చట్టాలు వారికి ఎందుకు వర్తించవని, చట్టాలు అందరికి సమానంగా వర్తించాలనే ఉద్దేశంతోనే నేను లేఖ రాశాను అని ప్రియాంక్ ఖర్గే అన్నారు. తాను ఇతరుల భావజాలంపై వ్యాఖ్యానించలేదని, రాహుల్ గాంధీ , మల్లికార్జున ఖర్గే, సిద్ధరామయ్య సిద్ధాంతాలను అనుసరించాలని అన్నారు.
ప్రియాంక్ ఖర్గే సొంత నియోజకవర్గం చిత్తాపూర్‌లోని అధికారులు ఈ నెల ప్రారంభంలో శాంతి భద్రతలను సమస్యను చూపుతూ, ఆర్ఎస్ఎస్ ర్యాలీకి అనుమతించడంతో వివాదం మొదలైంది. దీనిపై ఆర్ఎస్ఎస్ కర్ణాటక హైకోర్టును ఆశ్రయించింది. దీనిపై అక్టోబర్ 30 నాటికి నివేదిక సమర్పించాలని అధికారుల్ని ఆదేశించింది. దీని తర్వాత మార్చ్‌కు షరతులతో కూడిన అనుమతిని ఇచ్చారు. మరోవైపు, చిత్తాపూర్ ఆర్ఎస్ఎస్ ర్యాలీపై జరిగిన శాంతి సమావేశంలో ఏకాభిప్రాయం కుదరలేదు. భీమ్ ఆర్మీ , భారతీయ దళిత్ పాంథర్స్‌తో సహా అనేక గ్రూపులు లాఠీలు, కాషాయ జెండాలకు బదులుగా జాతీయ జెండా, రాజ్యాంగ ప్రవేశికను తీసుకెళ్లాలని ఆర్‌ఎస్‌ఎస్‌ను కోరాయి, కానీ ఆర్‌ఎస్‌ఎస్ ప్రతినిధులు ఆ ప్రతిపాదనను తిరస్కరించారు.