పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగిస్తున్నారు. కరోనా మహమ్మారిపై భారత్ పోరాటం స్ఫూర్తిదాయకం అన్నారు రాష్ట్రపతి. ప్రతి భారతీయుడికి స్వాతంత్య్ర అమృతోత్సవ్ శుభాకాంక్షలు తెలిపారు రాష్ట్రపతి. రాష్ట్రపతి హోదాలో రామ్ నాథ్ కోవింద్ కి ఇది చివరి ప్రసంగం కావడం విశేషం.
దేశం కోసం ప్రాణత్యాగం చేసిన అమరులకు నివాళులర్పించారు రాష్ట్రపతి. సబ్ కా సాత్ సబ్ కా వికాస్ మూలసూత్రంతో ప్రభుత్వం పనిచేస్తోంది. దేశాభివృద్ధి ప్రయాణంలో దోహదపడిన వ్యక్తులను స్మరించుకుంటున్నాం అన్నారు. దేశ సురక్షిత భవిష్యత్ కోసం గతాన్ని గుర్తుతెచ్చుకోవడం ముఖ్యం.గత స్మృతుల నుంచి నేర్చుకోవడం కూడా చాలా ముఖ్యం.వచ్చే 25 ఏళ్లపాటు పునాదులు పటిష్టంగా ఉండేలా ప్రభుత్వం కృషిచేస్తోందన్నారు.
ఏడాది కంటే తక్కువ వ్యవధిలో 150 కోట్ల వ్యాక్సినేషన్లు అందించామన్నారు. భారత వ్యాక్సిన్లు కోట్లమంది ప్రాణాలను కాపాడాయి: రాష్ట్రపతిఅర్హులైన 90 శాతం కంటే ఎక్కువమంది మొదటి డోసు టీకా తీసుకున్నారు. ప్రభుత్వ సున్నిత విధానాలతో సామాన్యులకు సులభంగా వైద్యసేవలు అందుతున్నాయన్నారు రాష్ట్రపతి. సామాన్యులకు సులభంగా ఆరోగ్య సేవలు అందుబాటులోకి వచ్చాయని, కోట్లమంది ఆయుష్మాన్ భారత్ కార్డులు అందుకున్నారన్నారు.
రాష్ట్రపతి ప్రసంగం పూర్తైన అరగంట తర్వాత లోక్‌సభ సమావేశం అవుతుంది. ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ 2021-22 ఆర్థిక సర్వే ప్రవేశపెట్టనున్నారు. సోమవారం మధ్యాహ్నం రెండున్నర గంటలకు రాజ్యసభ సమావేశం కానుంది.మంగళవారం ఉదయం 11 గంటలకు లోక్‌సభలో నిర్మలా సీతారామన్ 2022-23 ఆర్థిక సంవత్సర బడ్జెట్ ప్రవేశపెడతారు.రెండో తేదీ నుంచి నాలుగు రోజుల పాటు రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే అంశంపై చర్చకు కేటాయించినట్లు లోక్‌సభ సెక్రటేరియట్ వర్గాలు వెల్లడించాయి. ఫిబ్రవరి 7న ప్రధాని నరేంద్ర మోదీ చర్చకు సమాధానమిచ్చే అవకాశం ఉంది.ఈ సారి బడ్జెట్ సమావేశాలు రెండు దశల్లో జరగనున్నాయి. జనవరి 31 నుంచి ఫిబ్రవరి 11 వరకు తొలి దశ, మార్చి 14 నుంచి ఏప్రిల్ 8 వరకు రెండో దశ సమావేశాలు నిర్వహించనున్నారు.