G20 Summit: సెప్టెంబర్ 9-10 తేదీల్లో ఢిల్లీలో జీ20 సదస్సు జరగబోతోంది. అయితే ఈ సమావేశానికి హాజరయ్యే దేశాధినేతలకు విందు ఇచ్చేందుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆహ్వానం పలికారు. ప్రస్తుతం ఈ ఆహ్వానమే వివాదాస్పదం అవుతోంది. సాధారణంగా రాష్ట్రపతి ఆహ్వానంలో ‘‘ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా’’ అని ఉంటుంది. అయితే ఈ ఆహ్వానంలో మాత్రం ‘‘ ప్రెసిడెంట్ ఆఫ్ భారత్’’గా ఉంది. ఇప్పుడు ఇదే కొత్త రచ్చకు కారణమవుతోంది. సెప్టెంబర్ 9న రాష్ట్రపతి జీ20 దేశాధినేతలను విందుకు ఆహ్వానించారు. అంతర్జాతీయ వేదికపై ఇండియా పేరుకు బదులు భారత్ అనే పేరును బలంగా వినిపించేందుకు కేంద్రం ప్రయత్నిస్తోంది.
ఏ అధికారిక కార్యక్రమానికైనా ఇలా భారత్ అని మార్చడం ఇదే మొదటిసారని అధికారులు చెబుతున్నారు. భారత్ అనే పదం రాజ్యాంగంలో కూడా ఉందని అధికారులు చెబుతున్నారు. ఇండియా అంటే భారత్ రాష్ట్రాల యూనియన్ అని రాజ్యాంగంలోని ఆర్టికల్ 1 పేర్కొంటుంది. మరోవైపు అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వసర్మ ‘‘రిపబ్లిక్ ఆఫ్ భారత్-మన నాగరికత అమృత్ కాల్ వైపు ధైర్యంగా ముందుకు సాగుతున్నందుకు సంతోషంగా మరియు గర్వంగా ఉంది’’ అంటూ ట్వీట్ చేశారు.
Read Also: Russia: పుతిన్, కిమ్ సమావేశం.. ఆయుధాల డీల్ కోసమే..
ఇదిలా ఉంటే ఈ చర్యను అధికార బీజేపీ పార్టీ స్వాగతిస్తుండగా.. విపక్షాలు మాత్రం దీనిపై విమర్శలు చేస్తున్నాయి. కాంగ్రెస్ నేత జైరాం రమేష్ ఈ చర్యను విమర్శించారు. ‘‘కాబట్టి ఆ వార్త నిజం.. జీ20 డిన్నర్ కి రాష్ట్రపతి పంపిన ఆహ్వానంలో ‘‘ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా’’ బదులు ‘‘ప్రెసిడెంట్ ఆఫ్ భారత్’’ అని ఉందని ’ఆయన ట్వీట్ చేశారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 1 ఇండియా, భారత్-యూనియన్ ఆఫ్ స్టేట్స్ అని, కానీ రాష్ట్రాల యూనియన్ ఇప్పుడు దాడికి గురవుతోందని ఆయన ఆరోపించారు.
మరోవైపు ఇండియా పేరును భారత్ గా కేంద్రం మారుస్తుందనే వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో ఈ ఆహ్వానం చర్చనీయాంశం అయింది. అంతకు ముందు బీజేపీ సైద్ధాంతిక గురువు ఆర్ఎస్ఎస్ సంస్థ చీఫ్ మోహన్ భగవన్ మాట్లాడుతూ.. దేశాన్ని ఇండియాకు బదులు భారత్ గా పిలువాలంటూ కామెంట్స్ చేశారు. ప్రతిపక్ష కూటమి ఇండియా అనే పేరు పెట్టుకున్న తర్వాత భారత్ వర్సెస్ ఇండియాల మధ్య చర్చ మొదలైంది.