కరోనా మహమ్మారిపై పోరాటంలో విజయం సాధించాలంటే వ్యాక్సినేషన్ ఒక్కటే మార్గం.. దీంతో.. ప్రభుత్వం వేగంగా వ్యాక్సిన్ పూర్తి చేసే విధంగా ముందుకు సాగుతోంది.. ఇప్పటికీ కొన్ని అపోహలు వెంటాడుతూనే ఉన్నాయి.. అందులో గర్భిణీ స్త్రీలకు వ్యాక్సిన్‌పై రకరకాల ప్రచారలు జరిగాయి.. అన్నింటికీ చెక్ పెడుతూ… గర్భిణీ స్త్రీలు కూడా టీకాకు అర్హులేనని స్పష్టం చేసింది కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ.. రోగనిరోధకతపై నేషనల్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ (ఎన్‌టిఐజి) సిఫారసులను అంగీకరించిన ఆరోగ్య మంత్రిత్వ శాఖ… గర్భిణీ స్త్రీలకు కూడా కోవిడ్ -19 టీకాలు వేయడానికి అనుమతించింది. గర్భిణీలు ఇప్పుడు కోవిన్‌లో వ్యాక్సిన్ స్లాట్ బుక్ చేసుకోవచ్చు అని.. లేదా తమకు సమీపంలోని కోవిడ్ టీకా కేంద్రానికి (సివిసి)కి వెళ్లవచ్చని తన ప్రకటనలో పేర్కొంది కేంద్రం.
గర్భిణీ స్త్రీలకు టీకాల విషయంలో అధికారులకు సూచనలు చేయాలని.. వైద్య అధికారులు మరియు ఎఫ్‌ఎల్‌డబ్ల్యుల కోసం కౌన్సెలింగ్ కిట్, ప్రజల కోసం ఐఇసి సామగ్రిని అందించాలని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు తెలిపింది కేంద్రం.. కోవిడ్ టీకా తీసుకోవడంపై గర్భిణీ స్త్రీలకు సమాచారం ఇవ్వడానికి ఈ నిర్ణయం అధికారం ఇస్తుందని మంత్రిత్వ శాఖ తెలిపింది. గర్భిణీ స్త్రీలు వైరస్ బారిన పడే ప్రమాదం ఎక్కువగా ఉంది.. దీంతో ఆరోగ్యం వేగంగా క్షీణించి పిండంపై కూడా ప్రభావం చూపుతుందని.. అందుకు.. వారికి కూడా వ్యాక్సిన్ వేయాలని నిర్ణయించినట్టు పేర్కొంది. కాగా, కోవిడ్ -19 వ్యాక్సిన్ గర్భిణీ స్త్రీలకు ఉపయోగకరంగా ఉంటుందని.. వారికి కూడా వ్యాక్సిన్ ఇవ్వాలని ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ (ఐసిఎంఆర్) డైరెక్టర్ జనరల్ డాక్టర్ బలరామ్ భార్గవ గతంలోనే చెప్పిన విషయం తెలిపిందే.