Poonch Attack: భారతదేశంపై పాకిస్తాన్ తన కుట్రలను అమలు చేయడం ఆపడం లేదు. తినడానికి తిండి లేకున్నా కూడా పాకిస్తాన్ భారత్ పై తన అక్కసును వెళ్లగక్కుతూనే ఉంది. భారత్ దినదినం అభివృద్ధి చెందుతుంటే, ఉగ్రవాద దేశంగా ముద్రపడిన పాకిస్తాన్ మాత్రం రోజురోజుకు ఆర్థిక, రాజకీయ సమస్యలతో పాతాళంలోకి కూరుకుపోతోంది. ఇంత జరుగుతున్నా కూడా భారత్ అంటే అదే ద్వేషం, అదే అక్కసు. ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు, జమ్మూకాశ్మీర్ విభజన, అక్కడ శాంతిభద్రతల పరిస్థితులు, పెట్టుబడులు రావడం పాకిస్తాన్ కు అస్సలు రుచించడం లేదు. దీనికి తోడు భద్రతాబలగాలు గత కొన్నేళ్లుగా ఉగ్రవాదులు కలుగులో దూరినా వదిలిపెట్టకుండా ఏరిపారేస్తోంది.
జీ-20 పై అక్కసు:
భారత్ ఈ ఏడాది జీ-20 గ్రూప్ కు అధ్యక్షత వహిస్తోంది. దేశంలోని అన్ని ప్రాంతాల్లో వరసగా జీ-20 సమావేశాలను నిర్వహిస్తోంది. ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్ శ్రీనగర్ లో జరగబోతున్న జీ-20 సమావేశం పాకిస్తాన్ కు అస్సలు నచ్చడం లేదు. దీనిపై రాద్ధాంత చేస్తోంది. జమ్మూ కాశ్మీర్ ను వివాదాస్పద ప్రాంతంగా చెప్పే ప్రయత్నం చేస్తోంది. మరోవైపు వచ్చే నెలలో జరగబోతున్న జీ-20 సమావేశం కోసం భారత్ అన్ని సన్నాహాలను చేస్తోంది. ఇప్పటికే పాకిస్తాన్ తన మిత్రదేశాలు టర్కీ, రష్యా, సౌదీ అరేబియాలతో లాబీయింగ్ చేపట్టింది. అయితే ఈ విషయంలో భారత్ వెనక్కి తగ్గదేలేదు అన్న రీతిలో పనులు చేసుకుంటూ పోతోంది. ఇటీవల కేంద్ర హోంమంత్రి అమిత్ షా భద్రతాబలగాలతో ప్రత్యేక సమావేశం నిర్వహించి, కాశ్మీర్ లో భద్రతపై చర్చించారు. లెఫ్టినెంట్ జనరల్ మనోజ్ సిన్హా భద్రత ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.
Read Also: Vande Bharat : త్వరలో పెరగనున్న వందేభారత్ ఎక్స్ ప్రెస్ భోగీలు
నిజం బయటపడుతుందని పాక్ భయం:
జమ్మూ కాశ్మీర్ పై ఇప్పటి వరకు అనేక అవాకులుచెవాకులు పేలుతోంది పాకిస్తాన్. అక్కడ మానవహక్కులు ఉల్లంఘనకు గురువుతోంది. లక్షల్లో సైన్యం మోహరించి ప్రజలు హక్కుల్ని కాలరాస్తోందని అంతర్జాతీయ సమావేశాల్లో నెత్తినోరు బాదుకుంటోంది. అంతే ధీటుగా భారత్ బదులు ఇస్తోంది. కాగా ప్రపంచంలో అభివృద్ధి చెందిన, చెందతున్న 20 దేశాల ప్రతినిధులు జమ్మూ కాశ్మీర్ వచ్చి వాస్తవ పరిస్థితిని తెలుసుకుంటే తమ వాదనల్లో పసలేదని అందరికి అర్థం అవుతుందని పాకిస్తాన్ భయపడుతోంది. మరోవైపు కాశ్మీర్ అందాలతో విదేశాల ప్రతినిధులు ముగ్ధులైతే ఎక్కడ విదేశీపెట్టుబడులు వస్తాయో అని పాక్ కలవరం. ఒకసారి కాశ్మీర్ అభివృద్ధి చెందడం ప్రారంభం అయితే మరో స్విట్జర్లాండ్ గా మారే అవకాశం ఉంటుంది. ఇదే సమయంలో పేదరికం, ఉగ్రవాదం, సైనిక అణిచివేతలో మగ్గుతున్న పాక్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్ ప్రాంత ప్రజల్లో భారత్ లో కలవాలనే ఆకాంక్ష పెరుగుతుందని పాకిస్తాన్ భయపడుతోంది.
జీ-20 జరగకూడదనే పూంచ్ ఉగ్రదాడి:
ఈ నేపథ్యంలో ఎలాగైనా సరే శ్రీనగర్ లో జరిగే జీ-20 సమావేశాలకు అడ్డుకోవాలన్నదే పాక్ దుష్టపన్నాగం. ఇందులో భాగంగానే మళ్లీ సరిహద్దుల్లో సీమాంతర ఉగ్రవాదాన్ని పెంచిపోషిస్తోంది. ఇందులో భాగంగానే గురువారం రోజు పూంచ్ లో జైషే మహ్మద్ అనుబంధ ఉగ్రసంస్థ దాడికి తెగబడింది. ఈ ఘటనలో ఐదుగురు జవాన్లు వీరమరణం పొందారు. జీ-20 సమావేశాలను ఉద్దేశించి కూడా బెదిరింపులకు పాల్పడ్డారు.
ఇదిలా ఉంటే గతంలో 2019లో పుల్వామా ఉగ్రదాడికి పాల్పడినందుకు జైషే మహ్మద్, పాకిస్తాన్ భారీ మూల్యాన్ని చెల్లించుకున్నాయి. 40 మందికి పైగా జవాన్లు మరణించడంతో పాకిస్తాన్ మెయిన్ ల్యాండ్ లోని బాలకోట్ ప్రాంతంలోని ఉగ్రవాద స్థావరాలపై వైమానికి దాడులు చేసింది. అయితే జీ-20 సమావేశానికి ముందు, భారత్ ను హెచ్చరించే విధంగా పూంచ్ ఉగ్రదాడి చేసినందుకు భారత్ ప్రతీకారం తీర్చుకునే అవకాశం పుష్కలంగా ఉంది. ఈ ఘటనకు పాకిస్తాన్ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఈ దాడికి పాల్పడిన ఉగ్రవాదులు, దాని ఆపరేటర్ల ఎవరనేదానిపై ఎన్ఐఏ విచారణ ప్రారంభించింది. మరోవైపు ఉగ్రవాదుల కోసం భద్రతబలగాలు వెతుకుతున్నాయి.