Rajnath Singh: పాక్ ఆక్రమిత కాశ్మీర్(పీఓకే)లోని ప్రజలు భారత్‌లో చేరాలని కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కోరారు. జమ్మూ కాశ్మీర్ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. బీజేపీ అభ్యర్థి రాకేష్ సింగ్ ఠాకూర్‌కి మద్దతుగా రాంబన్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఎన్నికల ర్యాలీలో రాజ్‌నాథ్ ప్రసంగించారు. పీఓకే ప్రజలు భారత్‌లో వచ్చి చేరాలని, వారిని విదేశీయుల్లా చూసే పాకిస్తాన్‌లా కాకుండా సొంతవారిలా ఆదరిస్తామని చెప్పారు.
ఆర్టికల్ 370 గురించి నేషనల్ కాన్ఫరెన్స్-కాంగ్రెస్ కూటమి హామీ ఇవ్వడాన్ని ఆయన ప్రస్తావించారు. ఎన్సీ మేనిఫెస్టోలో ఆర్టికల్ 370ని తిరిగి తీసుకువస్తామని హామీ ఇచ్చింది. అయితే, ఈ హామీ గురించి మాట్లాడుతూ రాజ్‌నాథ్ సింగ్ ఎన్సీ, కాంగ్రెస్ పార్టీలపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. బీజేపీ ఉన్నంత కాలం జమ్మూ కాశ్మీర్లో ఆర్టికల్ 370ని తీసుకురావడం అసాధ్యమని చెప్పారు.
Read Also: Brij Bhushan: వినేష్ ఫోగట్, బజరంగ్ పునియాలపై మాట్లాడొద్దు.. బ్రిజ్ భూషణ్‌కి బీజేపీ సలహా..
ఆగస్టు 2019లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత, 2014 ఎన్నికల తర్వాత తొలిసారిగా ఇక్కడ ఎన్నికలు జరుగుతున్నాయి. బీజేపీ, పీడీపీలు ఒంటరిగా పోటీ చేస్తుండగా, నేషనల్ కాన్ఫరెన్స్(ఎన్సీ)-కాంగ్రెస్‌లు కలిసి కూటమిగా పోటీలో నిలిచాయి. ఆర్టికల్ 370, 35-ఏ రద్దు తర్వాత జమ్మూ కాశ్మీర్‌లో జరిగిన మార్పుని రాజ్‌నాథ్ స్వాగతించారు. గతంలో ఇక్కడి యువకులు పిస్టల్స్, రివాల్వర్లను కలిగి ఉండేవారని, ఇప్పుడు వారి చేతుల్లో ల్యాప్‌టాప్, కంప్యూటర్లు ఉన్నాయని అన్నారు.
జమ్మూ కాశ్మీర్‌లో 2014 తర్వాత, ఆర్టికల్ 370 రద్దు తర్వాత తొలిసారిగా ఎన్నికలు జరగబోతున్నాయి. 90 మంది సభ్యులు ఉన్న అసెంబ్లీకి 3 దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. మొదటి దశ సెప్టెంబర్ 18న, రెండో దశ సెప్టెంబర్ 25, మూడో దశ అక్టోబర్ 01న జరుగుతాయి. అక్టోబర్ 08న కౌంటింగ్ జరగనుంది.