Congress: బీజేపీ ఛత్తీస్గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు సీఎంలుగా కొత్తవారిని నియమించడంపై కాంగ్రెస్ కీలక వ్యాఖ్యలు చేసింది. ఆ పార్టీ ఎంపీ, సీనియర్ నేత అధిర్ రంజన్ చౌదరి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రుల ఎంపికపై విరుచుకుపడ్డారు. ప్రధాని నరేంద్రమోడీ రాహుల్ గాంధీ మార్గంలో నడుస్తున్నారంటూ పేర్కొన్నారు.
‘‘రాహుల్ గాంధీ చెప్పిన మాటలు మోడీజీని ప్రభావితం చేస్తున్నాయి. రాహల్‌జీ కులగణన గురించి మాట్లాడిన తర్వాత, ఇప్పుడు ముఖ్యమంత్రులలో కుల సమీకరణాన్ని పాటిస్తున్నారు. రాహుల్ గాంధీ అనుసరించిన మార్గంలో ప్రధాని మోడీ నడుస్తున్నారు.’’ అంటూ అధిర్ రంజన్ అన్నారు. రాహుల్ దేని గురించైనా మాట్లాడినప్పుడల్లా, మోడీజీ దానిని స్వీకరించి, అమలు చేసేందుకు కృషి చేస్తున్నారని ఎద్దేవా చేశారు.
Read Also: Bhajan Lal Sharma: “సర్పంచ్ నుంచి సీఎం దాకా”.. రాజస్థాన్ సీఎం అద్భుత రాజకీయ ప్రస్థానం..
మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఎంపికలో బీజేపీ అనూహ్య నిర్ణయాలు తీసుకుంది. మాజీ ముఖ్యమంత్రులను, సీనియర్ నాయకులను పక్కన పెట్టేసి కొత్తవారికి అవకాశం ఇచ్చింది. ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రిగా గిరిజన నాయకుడు విష్ణుదేవ్ సాయ్‌ని ఆదివారం ప్రకటించింది. సోమవారం రోజున మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా బీసీ నేత అయిన మోహన్ యాదవ్‌ని ఎన్నుకుంది. ఈ రోజు బ్రహ్మన వర్గానికి చెందిన భజన్ లాల్ శర్మను రాజస్థాన్ సీఎంగా చేసింది. రేపు ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రులు ప్రమాణస్వీకారం చేస్తుండగా.. ఈ నెల 15న రాజస్థాన్ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం ఉండబోతోంది.