పీఎం కిసాన్ సమ్మాన్ నిధి 11వ విడత సొమ్మును ప్రధాని మోడీ మంగళవారం ఇవాళ సివ్లూలో విడుదల చేయనున్నారు. దాదాపు పది కోట్లు మంది రైతుల ఖాతాల్లోకి నేరుగా రూ. 21,000 కోట్లను జమచేయనున్నట్లు అధికార వర్గాలు తెలియజేశాయి. ఆజాదీకా అమృత మహోత్సవ్ సందర్భంగా నిర్వహిస్తున్న గరీబ్ కల్యాణ్ సమ్మేళనంలో ఈ మొత్తాన్ని విడుదల చేస్తారని చెప్పారు.
తొమ్మిది కేంద్ర మంత్రిత్వ శాఖలకు చెందిన 16 పథకాల లబ్ధిదారులతో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్ లో నేరుగా ముచ్చటిస్తారని విద్యుత్ మంత్రిత్వ శాఖ వర్గాలు తెలియజేశాయి. ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి, ప్రధాన మంత్రి ఉజ్వల యోజన, పోషన్ అభియాన్, జల్ జీవన్ మిషన్, అమృత్, ప్రధాన మంత్రి స్వానిధి యోజన వంటి పథకాల లబ్ధిదారులతో మోడీ మాట్లాడుతారు.
లబ్ధిదారుల జీవితాలను ఈ పథకాల ఏ మేరకు ప్రభావితం చేశాయో వారినే అడిగి ప్రధాని తెలుసుకుంటారు. ఇందుకోసం వివిధ రాష్ట్రాల రాజధానులను, జిల్లా ప్రధాన కేంద్రాలను, కృషి విజ్ఞాన్ కేంద్రాలను అనుసంధానం చేయనున్నారు. దేశంలో ఇలాంటి ప్రోగ్రామ్‌ను ఇంత పెద్ద ఎత్తున నిర్వహించడం ఇదే తొలిసారి.
ప్రధాని కిసాన్ పథకం కింద ఏటా ఆరు వేల రూపాయలను అర్హులైన రైతులకు అందజేస్తారు. ఈ మొత్తాన్ని రెండు వేల రూపాయల చొప్పున మూడు విడతలుగా అందజేస్తారు. జనవరి ఒకటవ తేదీన మోడీ 10 విడత కింద రైతుల ఖాతాలలో రెండు వేల వంతున విడుదల చేశారు. అప్పట్లో దాదాపు 20 వేల కోట్లు విడుదలయ్యాయి.