PM Narendra Modi Sensational Comments In Gujarat Election Campaign: గుజరాత్ ఎన్నికల ప్రచారంలో ప్రధాని నరేంద్ర మోడీ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు.. ఉగ్రవాదాన్ని టార్గెట్ చేయమని తాము చెప్పామని, కానీ వాళ్లు తనని టార్గెట్ చేశారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ ఉగ్రవాదాన్ని కూడా ఓటు బ్యాంకు రాజకీయాలకు వాడుకుంటోందని అన్నారు. కాంగ్రెస్ హయాంలో అనేక చోట్ల ఉగ్రదాడులు జరిగాయని, అయినా కాంగ్రెస్ చర్యలు తీసుకోకుండా ఉగ్రవాదం పట్ల ఉదాసీనంగా వ్యవహరించిందని పేర్కొన్నారు. అయితే.. బీజేపీ అధికారంలోకి వచ్చాక ఉగ్రవాదులు భయపడుతున్నారని మోడీ పేర్కొన్నారు.
‘‘కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు దేశంలో ఉగ్రవాద కార్యాకలాపాలు విస్తృతంగా పెరిగాయి. గుజరాత్ రాష్ట్రం చాలాకాలం వరకు ఉగ్రవాదుల లక్ష్యంగా ఉంది. సూరత్, అహ్మదాబాద్‌లలో ఎన్నోసార్లు దాడులు జరిగాయి. ఆ దాడుల్లో ఎందరో రాష్ట్ర ప్రజలు మృతి చెందారు. అప్పుడు ఉగ్రవాదాన్ని టార్గెట్ చేయమని కాంగ్రెస్‌ని కోరాం. కానీ, వాళ్లు నన్ను మాత్రమే టార్గెట్ చేశారు. వాళ్లు నా మీద దృష్టి సారించడం వల్ల.. ఉగ్రవాదులు రెచ్చిపోయారు. దేశంలో చాలా చోట్ల బాంబు దాడులు జరిగాయి. ఉగ్రవాదాన్ని కూడా కాంగ్రెస్ తన ఓటు బ్యాంకుగా పరిగణిస్తోంది. బాట్లా హౌస్ ఎన్‌కౌంటర్ జరిగినప్పుడు.. కాంగ్రెస్ నేతలు వారికి మద్దతుగా మాట్లాడారు. టెర్రరిస్టులకు అనుకూలంగా మొసలి కన్నీరు కార్చారు’’ అంటూ మోడీ చెప్పారు. అయితే బీజేపీ మాత్రం ఉగ్రవాదాన్ని అంతం చేసేందుకు కృషి చేస్తోందని, ఇప్పుడు ఉగ్రవాదులు సరిహద్దుల్లో దాడులు చేయడానికి ముందు ఉగ్రవాదులు ఒకటికి పదిసార్లు ఆలోచిస్తున్నారని తెలిపారు.
ఇదే సమయంలో.. ఆమ్ ఆద్మీ పార్టీపై కూడా మోడీ ధ్వజమెత్తారు. కొన్ని పార్టీలు షార్ట్ కట్స్‌ని నమ్ముకుంటున్నాయని.. బుజ్జగింపు, ఓటు బ్యాంక్ రాజకీయాలను అనుసరిస్తున్నాయని ఆప్‌పై సెటైర్లు గుప్పించారు. అందుకే ఉగ్రవాదం విషయంలో మౌనంగా ఉంటున్నాయన్నారు. కాగా.. గుజరాత్‌లో డిసెంబర్ 1, డిసెంబర్ 5న రెండు దశల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. డిసెంబర్ 8న ఫలితాలను ప్రకటిస్తారు. గత 27 సంవత్సరాలుగా గుజరాత్‌లో అధికారంలో ఉన్న బీజేపీ.. ఈసారి కూడా గెలవాలని కసరత్తు చేస్తోంది. ఈ ఎన్నికల్లో 140 సీట్లు సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది.