PM Narendra Modi: కాంగ్రెస్ పార్టీని ఉద్దేశిస్తూ ప్రధాని నరేంద్రమోదీ పరోక్షంగా తీవ్ర విమర్శలు చేశారు. తనను కించపరిచేందుకు దేశం లోపల, బయట వ్యక్తులు కుమక్కై పనిచేస్తున్నారంటూ ఆరోపించారు. ఇటీవల రాహుల్ గాంధీ శిక్ష, అనర్హత తర్వాత పలు దేశాలు స్పందించడం, యూకే, అమెరికా, జర్మనీ వంటి దేశాలు రాహుల్ గాంధీ విషయాన్ని గమనిస్తున్నామని చెప్పడం తర్వాత ప్రధాని ఈ రోజు ఈ వ్యాఖ్యలు చేశారు. శనివారం భోపాల్-న్యూ ఢిల్లీల మధ్య వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలు ప్రారంభించిన తర్వాత ఆయన మాట్లాడారు. ఇప్పటికే ఈ విషయంలో విదేశాల స్పందన అనంతరం కాంగ్రెస్ విదేశీ జోక్యం కోరుతుందని బీజేపీ తీవ్ర విమర్శలు చేస్తోంది. ఈ నేపథ్యంలో ప్రధాని నోట నుంచి కూడా ఇలాంటి వ్యాఖ్యలు రావడం గమనార్హం.
Read Also: Delhi Hit And Drag Case: యువతిని కారు ఈడ్చుకెళ్లిన కేసులో 800 పేజీల ఛార్జిషీట్ దాఖలు..
మన దేశంలో 2014 నుంచి కొంత మంది బహిరంగంగా మోదీ ప్రతిష్టను దిగజార్చుతామని సంకల్పంతో పనిచేస్తున్నారని ప్రధాని ఆరోపించారు. ఇలాంటి వ్యక్తులకు సహాయం చేయడానికి కొంతమంది దేశంలో, మరికొంత మంది విదేశాల్లో ఉంటూ సహాయం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ వ్యక్తులు నిరంతరం మోదీ ప్రతిష్టను దిగజార్చడానికి, చెడగొట్టడానికి ప్రయత్నిస్తున్నారని ఆయన అన్నారు. కానీ మోదీ దేశంలోని పేదలు, మధ్యతరగతి, గిరిజనులు, దళితులు, వెనుకబడిన తరగతులు మరియు ప్రతి భారతీయుడికి భద్రతగా మారాడాని అన్నారు. ఇలాంటి వారి కుట్రల మధ్య ప్రతీ భారతీయుడు దేశాభివృద్ధిపై దృష్టి పెట్టాలని మోదీ సూచించారు. గత ప్రభుత్వాలు ఓటు బ్యాంకు బుజ్జగింపు రాజకీయాల్లో బిజీగా ఉండేవని, కనీసం ప్రజల అసవరాలు కూడా తీర్చేలేనంతగా బిజీగా ఉండేవని ఆరోపించారు. గత ప్రభుత్వాలు ఒక కుటుంబాన్ని మాత్రమే దేశానికి మొదటి కుటుంబంగా భావించి పేద, మధ్యతరగతిని విస్మరించారని అన్నారు.
ఇదిలా ఉంటే రాహుల్ విషయంపై జర్మనీ, యూకే, అమెరికా స్పందించాయి. ఈ విషయాన్ని పరిశీలిస్తున్నామని అన్నాయి. ఇటీవల రాహుల్ గాంధీపై జర్మనీ విదేశీ మంత్రిత్వ శాఖ ఓ ప్రకటన చేయగా, కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ జర్మనీకి థాంక్స్ చెబుతూ ట్వీట్ చేశారు. అయితే దీనిపై కేంద్ర మంత్రులు కిరణ్ రిజిజు, అనురాగ్ ఠాకూర్ తీవ్రంగా స్పందించారు. కాంగ్రెస్ భారత అంతర్గత విషయాల్లో విదేశీ జోక్యాన్ని కోరుతుందని విమర్శించారు. అయితే దీంతో కాంగ్రెస్ దిద్దుబాటు చర్యలను చేపట్టింది. భారత ప్రజాస్వామ్యాన్ని తామే రక్షించుకుంటామని కాంగ్రెస్ వ్యాఖ్యానించింది.