PM Modi: బిజూ జనతాదళ్(బీజేడీ) అధినేత, ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్‌పై ప్రధాని మోడీ ద్వజమెత్తారు. ఒడిశాలో పేదరికానికి కాంగ్రెస్, బీజేడీలు కారణమని ఆరోపించారు. సోమవారం బెర్హంపూర్‌లో ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న పీఎం మోడీ సీఎం నవీన్ పట్నాయక్ పేరును ప్రస్తావించకుండా విమర్శలు గుప్పించారు. ఒడిశాకు ఒడియా భాష, సంస్కృతిని అర్థం చేసుకునే ముఖ్యమంత్రి కావాలని అన్నారు. ఒడిశాలో ఒకేసారి లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ప్రధాని ఈ రోజు భారీ ర్యాలీలో పాల్గొన్నారు.
Read Also: Covishield: కోవిషీల్డ్ వ్యాక్సిన్ సైడ్ ఎఫెక్ట్స్‌పై ఆందోళన.. విచారణకు సుప్రీంకోర్టు అంగీకారం..
ఒడిశాను బీజేడీ, కాంగ్రెస్‌లు కొన్నేళ్లుగా దోచుకుంటున్నాయని ఆరోపించారు. ఒడిశాలో దాదాపు 50 ఏళ్లు కాంగ్రెస్, 25 ఏళ్లు బీజేడీ పాలించాయని అయినా అభివృద్ధికి నోచుకోలేదని చెప్పారు. ఒడిశాలో సారవంతమైన భూమి, ఖనిజ వనరులు, సముద్ర తీరాలు, బెర్హంపూర్ లాంటి వాణిజ్య కేంద్రం, సంస్కృతి, వారసత్వం ఉన్నాయి, కానీ ప్రజలు పేదవారిగా ఉన్నారని అన్నారు. గతంలో మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్న సోనియాగాంధ రిమోట్ కంట్రోల్ ప్రభుత్వం ఒడిశాకు పదేళ్లలో లక్ష కోట్లు ఇస్తే, మోడీ ప్రభుత్వం రూ. 3.5 లక్షల కోట్లు ఇచ్చిందని చెప్పారు.
ఒడిశాలో వచ్చే ఎన్నికల్లో బీజేడీకి ప్రజలు స్వస్తి పలుకుతారని, బీజేపీ విజయం సాధిస్తుందని ప్రధాని ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల తర్వాత బీజేపీ వ్యక్తి సీఎం అవుతారని అన్నారు. జూన్ 4న బీజేడీ ప్రభుత్వానికి గడువు తేదీ అని, జూన్ 10న బీజేపీ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేస్తారని చెప్పారు.