PM Modi Bhutan Visit: ప్రధాని నరేంద్రమోడీ రెండు రోజుల భూటాన్ దేశ పర్యటన వాయిదా పడింది. ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా ఈ పర్యటన వాయిదా పడినట్లు తెలుస్తోంది. రేపు ప్రధాని భూటాన్ బయలుదేరాల్సి ఉంది. అయితే, భూటాన్ లోని పారో విమానాశ్రయంలో ప్రతికూల వాతావరణ పరిస్థితులు కొనసాగుతుండటంతో పర్యటన వాయిదా పడినట్లు అధికార ప్రకటన తెలిపింది. ‘‘పారో విమానాశ్రయంపై కొనసాగుతున్న ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా, 2024 మార్చి 21-22 తేదీల్లో భూటాన్‌లో ప్రధాని పర్యటనను వాయిదా వేయాలని పరస్పరం నిర్ణయించుకున్నారు. కొత్త తేదీలను దౌత్య మార్గాల ద్వారా ఇరుపక్షాలు రూపొందిస్తున్నాయి.’’ అని ప్రకటన పేర్కొంది.
Read Also: Pakistan: గ్వాదర్ పోర్ట్‌పై బలూచ్ మిలిటెంట్ల దాడి.. 8 మంది మృతి
ఇటీవల భూటాన్ ప్రధాని షేరింగ్ టోబ్‌గే భారత్‌లో పర్యటించారు. ఈ పర్యటనలో భూటాన్ రాజు జిగ్మే ఖేసర్ నామ్‌గేల్ వాంగ్‌చుక్ తరుపున తమ దేశంలో పర్యటించాలని ప్రధాని మోడీని ఆహ్వానించారు. ఈ ఆహ్వానాన్ని ప్రధాని మోడీ ఆమోదించారు. భారత్ సన్నిహిత, సరిహద్దు దేశం భూటాన్ పర్యటనతో ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింత మెరుగుపడుతాయని అంతా ఆకాంక్షించారు. ఎన్నికల వేళ ప్రధాని దేశాన్ని వదిలి భూటాన్ పర్యటనకు వెళ్లండం చర్చనీయాంశంగా మారింది. ఇటీవల భూటాన్ విషయంలో చైనా కవ్వింపుల నేపథ్యంలో ప్రధాని మోడీ పర్యటన కీలకంగా మారింది.
భారత్,చైనా సరిహద్దుల్లో ఉన్న భూటాన్ దేశం వ్యూహాత్మకంగా భారత్‌కి ఎంతో కీలకం. గతంలో డోక్లాం పీఠభూమి వద్ద చైనా ఆర్మీని అడ్డుకుని భూటాన్ సార్వభౌమాధికారాన్ని భారత్ కాపాడింది. అయితే, ఇటీవల కాలంలో చైనా ఆ దేశాన్ని సరిహద్దు వివాదాలతో ఇబ్బందులు పెడుతోంది. ఈ నేపథ్యంలో ప్రధాని మోడీ భూటాన్ పర్యటన పరిస్థితిని మార్చే అవకాశం ఉందని అంతా భావించారు.