వందేమాతరం కేవలం పాట కాదని.. ఇది రాముడి భారత్ దార్శనికతను ప్రతిబింబిస్తుందని ప్రధాని మోడీ అన్నారు. ‘వందేమాతరం’ 150వ వార్షికోత్సవం సందర్భంగా పార్లమెంట్‌లో మోడీ ప్రత్యేక చర్చ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వందేమాతరం భారతదేశంలో బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ఒక యుద్ధ నినాదం అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రతిపక్షాలపై ప్రధాని మోడీ విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్‌ను తీవ్రంగా విమర్శిస్తూ.. వందేమాతరం 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్నప్పుడు దేశం అత్యవసర పరిస్థితిలో ఉందని పేర్కొన్నారు. ఇక ఈ పాట 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్నప్పుడు భారతదేశం పరాయి పాలనలో ఉందని తెలిపారు. బంకిం చంద్ర చటోపాధ్యాయ వందేమాతరం పాటతో బ్రిటిష్ వారిని సవాలు చేశారని గుర్తుచేశారు. స్వాతంత్ర్య పోరాటంలో వందేమాతరం దేశానికి స్ఫూర్తినిచ్చి.. సాధికారతను కల్పించిందని స్పష్టం చేశారు. ఈ చర్చ భవిష్యత్ తరాలకు స్ఫూర్తినిస్తుందనే చేపట్టినట్లు పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: Indigo Crisis: డంప్ యార్డ్‌ల్లా ఎయిర్‌పోర్టులు.. ఎటు చూసినా కుప్పలు తెప్పలుగా లగేజీ బ్యాగులు
‘‘వందేమాతరం గీతంపై చర్చ చేపట్టినందుకు సభ్యులకు ధన్యవాదాలు.. స్వాతంత్ర్య ఉద్యమంలో కోట్ల మందికి స్ఫూర్తి నింపిన వందేమాతర గీతంపై చర్చ జరపడం మనందరి అదృష్టం. ఈ చర్చ.. చరిత్రతో ముడిపడిన అనేక ఘట్టాలను మన కళ్ల ముందుకు తీసుకొస్తుంది.. ఈ మధ్యే మనం రాజ్యాంగ 75 ఏళ్ల సంబరాలు జరుపుకున్నాం.. 150 ఏళ్ల వందేమాతర గీతం ప్రయాణం ఎన్నో ఘట్టాలను దాటుకుంటూ వెళ్లింది’’ అని ప్రధాని మోడీ పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: Gold Rates: గోల్డ్ లవర్స్‌కు మళ్లీ షాక్.. ఈరోజు ఎంత పెరిగిందంటే..!
పార్లమెంట్‌లో ‘వందేమాతరం’పై 10 గంటలు చర్చకు కేటాయించబడింది. ప్రధాని మోడీ తర్వాత రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ ప్రసంగించనున్నారు. అనంతరం గౌరవ్ గొగోయ్, ప్రయాంకాగాంధీతో సహా ఎనిమిది మంది కాంగ్రెస్ ఎంపీలు ప్రసంగించనున్నారు. ఇక రాజ్యసభలో హోంమంత్రి అమిత్ షా చర్చను ప్రారంభించనున్నారు.
వందేమాతం గీతాన్ని బంకిం చంద్ర ఛటర్జీ రాశారు. నవంబర్ 7, 1875లో బంగదర్శన్‌లో మొదటిసారిగా ప్రచురించబడింది. 1905లో బెంగాల్‌లో జరిగిన విభజన వ్యతిరేక ఆందోళన సమయంలో ఈ గీతాన్ని రాజకీయంగా ఉపయోగించారు. అనంతరం ఈ గీతం దేశ వ్యాప్తంగా స్వాతంత్ర్య సమరయోధులను ఏకతాటిపైకి తీసుకొచ్చింది. ఇక ఈ గీతాన్ని జనవరి 24, 1950లో జాతీయ గీతంగా పరిగణించారు. ఇటీవలే కేంద్ర ప్రభుత్వం వందేమాతరం 150వ వార్షికోత్సవం నిర్వహించింది. ఏడాది పొడవునా వందేమాతరం వార్షికోత్సవాలు నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది.