PM Modi: బీహార్ ఎన్నికల ప్రచారంలోకి ప్రధాని నరేంద్రమోడీ దిగారు. బీహార్‌లోని బీజేపీ కార్యకర్తలతో ప్రధాని గురువారం మాట్లాడుతూ.. బీహార్‌లో ‘‘జంగిల్ రాజ్’’ మరో 100 ఏళ్లు అయినా మరిచిపోలేమని, ఆ కాలపు అనుభవానలు యువతరానికి అందించాలని రాష్ట్రంలోని సీనియర్ ఓటర్లను ఆయన కోరారు. ప్రతిపక్షాలు తమ తప్పును దాచడానికి ఎంత ప్రయత్నించినా, ప్రజలు దానిని క్షమించరని ఆయన అన్నారు. ప్రతిపక్ష కూటమి ఘటబంధన్(కూటమి)కి బదులుగా ‘లఠబంధన్’(నేరస్తుల కూటమి) అని పిలిచారు. ప్రతిపక్ష నేతలంతా ఢిల్లీ, బీహార్‌లో బెయిల్‌పై బయట ఉన్నారని అన్నారు.
ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ పాలనను తరుచుగా ‘ఆటవిక రాజ్యం’గా విమర్శిస్తారు. ఈ రోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ‘‘మేరా బూత్ సబ్సే మజ్‌బూత్: యువ సంవాద్’’ కార్యక్రమంలో ప్రధాని మోడీ మాట్లాడారు. బీహార్ లోని యువకులంతా ప్రతీ బూత్‌లో యువకులందర్ని సమావేశపరచాలని, ఆ ప్రాంతంలోని వృద్ధులను వచ్చి జంగిల్ రాజ్ గురించి యువతకు చెప్పాలని ప్రధాని చెప్పారు. సీఎం నితీష్ కుమార్, ఎన్డీయే బీహార్‌ను అడవి రాజ్యం నుంచి బయటకు తీసుకురావడానికి, చట్ట పాలనను స్థాపించడానికి చాలా కష్టపడ్డారని, ఇప్పుడు ప్రజలు తమను తాము గర్వంగా బీహారీలమని పిలుచుకుంటున్నారని మోడీ అన్నారు.
ప్రతిపక్ష కూటమి నాయకులు తమలో తాము ఎలా పోరాడాలో, వారి స్వార్థ ప్రయోజనాలను కాపాడుకోవడం మాత్రమే తెలుసని విమర్శించారు. రాబోయే ఎన్నికలు రాష్ట్ర చరిత్రలో కొత్త అధ్యాయనాన్ని రాయడానికి మరో అవకాశం అని, యువతరం కీలక పాత్ర పోషించాలని ప్రధాని మోడీ అన్నారు. బీహార్‌లో స్థిరత్వం ఉన్నపుడే, అభివృద్ధి వేగవంతమవుతుందని చెప్పారు.
