PM Modi: నా మాట విని బంగారం కొనడం తగ్గించారు.. ఇప్పుడు లాభపడ్డారు..

  • బంగారం కొనడం తగ్గించమని గతంలోనే చెప్పా..
  • నా మాట విని డబ్బును ఆదా చేసుకున్నారు..
  • ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు..
Pm Modi

Pm Modi

PM Modi: దేశంలో బంగారం కొనుగోళ్లపై ప్రధాని నరేంద్ర మోడీ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. అవసరం లేకపోతే బంగారం కొనుగోళ్లను తగ్గించాలని తాను గతంలో చేసిన సూచనలను ప్రజలు పాటించారని అన్నారు. దీని వల్ల దేశానికి డబ్బు ఆదా అయిందని చెప్పారు. శనివారం లక్నోలో జరిగిన ఐదో జాతీయ కౌశల్ దీక్షాంత్ సమారోహ్‌లో ప్రధాని మోదీ పాల్గొన్నారు. ఆ సమయంలో చాలా మంది తన మాటను ఎగతాళి చేశారని, కానీ ఇప్పుడు ఆ సలహా పాటించడం వల్ల తమకు డబ్బు ఆదా అయిందని ప్రజలు చెబుతున్నారని తెలిపారు. ఒకప్పుడు దేశ ప్రజలు ఒక పూట భోజనం మానుకోవాలని శాస్త్రి పిలుపునిచ్చినప్పుడు ప్రజలు దానికి స్పందించారని అన్నారు. అదే స్ఫూర్తి ఇప్పటికీ దేశ ప్రజల్లో ఉందని వ్యాఖ్యానించారు.

యువత నైపుణ్యాల ప్రాధాన్యత గురించి మాట్లాడుతూ.. ఐఐటీ, ఐటీఐ విద్యార్థలనున ఒకే విధంగా గౌరవించాలని మోడీ సూచించారు. ఐఐటీలో చదివేవారైనా, ఐటీఐలో శిక్షణ పొందేవారైనా దేశ అభివృద్ధిలో కీలకమని అన్నారు. కేవలం డిగ్రీలు సంపాదించడం మాత్రమే భవిష్యత్తుకు సరిపోదని, విద్యతో పాటు స్కిల్స్ కూడా పెంపొందించుకోవాలని యువతకు సూచించారు. స్కిల్స్, టెక్నాలజీతోనే వికసిత భారత్ లక్ష్యాన్ని సాధించగమని అన్నారు.

భారత్ ఒకప్పుడు చేతివృత్తులు, సంప్రదాయ కళలు, నైపుణ్యాలకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిందని మోడీ అన్నారు. ఇలాంటి వృత్తులకు పూర్వ వైభవం తీసుకురావాలని పిలుపునిచ్చారు. బ్రిటిష్ పాలనలో సంప్రదాయ నైపుణ్యాలు, వృత్తి ఆధారిత విద్యకు ప్రాధాన్యత తగ్గిందని ఆయన విమర్శించారు. మెకాలే ప్రవేశపెట్టిన విద్యావిధానం కారణంగా ప్రాక్టికల్ విద్య కంటే కార్యాలయ ఉద్యోగాలకు అవసరమైన విద్యకు ఎక్కువ ప్రాధాన్యత లభించిందని వ్యాఖ్యానించారు. దేశంలో సుమారు 50 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారని ప్రధాని మోడీ తెలిపారు. ప్రభుత్వ ప్రయత్నాల వల్ల ప్రజల్లో తమ ఆర్థిక పరిస్థితిని మెరుపరుచుకోవచ్చనే విశ్వాసం పెరిగిందని పేర్కొన్నారు.