PM Modi: కాంగ్రెస్ పార్టీ, అశోక్ గెహ్లాట్ లక్ష్యంగా ప్రధాని నరేంద్రమోడీ సంచలన వ్యాఖ్యలు చేశారు. గతేడాది ఉదయ్‌పూర్‌లో దారుణంగా మతోన్మాదులు చేతిలో హత్యకు గురైన కన్హయ్య లాల్ అంశాన్ని మోడీ ప్రస్తావించారు. రాజస్థాన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా చిత్తోర్‌గఢ్ ర్యాలీలో ఆయన ప్రసంగించారు. శాంతిభద్రతల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ‘‘ఉదయ్‌పూర్ లో ఏం జరిగింది.. అలాంటివి జరుగుతాయని ఎవరైనా ఊహించారా..? బట్టలు కుట్టించుకునే నెపంతో వచ్చి గొంతు కోసి చంపారు.’’ అని కన్హయ్యలాల్ హత్య ఉదంతం గురించి ప్రధాని మోడీ మాట్లాడారు.
కన్హయ్యలాల్ దారుణహత్య విషయంలో కాంగ్రెస్ ఓటు బ్యాంకు రాజకీయాలు చేసిందని ప్రధాని ధ్వజమెత్తారు. హత్య జరిగిన సమయంలో కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందని ప్రశ్నించారు. గెహ్లాట్ ప్రభుత్వం ఉగ్రవాదుల పట్ల ఆప్యాయతతో వ్యవహరిస్తుంటే, చట్టానికి వారు ఎలా భయపడతారని అన్నారు. ప్రజలను తప్పదోవ పట్టిస్తూ అశోక్ గెహ్లాట్ తన కుర్చీని కాపాడుకునేందుకు ప్రయత్నిస్తున్నాడని, కాంగ్రెస్ అంతర్గత పోరును ప్రస్తావిస్తూ ప్రధాని విమర్శలు చేశారు.
Read Also: Kerala: గూగుల్ మ్యాప్స్‌ని నమ్మిపోతే.. కారు నదిలో మునిగి ఇద్దరు డాక్టర్లు మృతి
గెహ్లాట్ ఇప్పటికే ఓటమిని అంగీకరించారని, తమ పథకాలను ఆపొద్దని బీజేపీని అభ్యర్థిస్తున్నారని, అయితే ఏ ప్రజాపథకాన్ని ఆపబోమని నేను హామీ ఇస్తున్నానని, కానీ మెరుగుపరచడానికి ప్రయత్నిస్తామని మోడీ అన్నారు. బీజేపీలో వసుంధర రాజే, గజేంద్ర సింగ్ షెకావత్ వంటి అనుభవం కలిగిన వారున్నారని ఆయన అన్నారు. రాజస్థాన్ లో మహిళపై జరుగుతున్న అఘాయిత్యాలు చూస్తుంటే తనకు బాధ కలుగుతోందని, కాంగ్రెస్ పార్టీ దీన్ని సంప్రదాయంగా మార్చిందని మోడీ విమర్శించారు.
మహ్మద్ ప్రవక్తపై నూపుర్ శర్మ వివాదాస్పద వ్యాఖ్యల తర్వాత, ఉదయ్‌పూర్‌కి చెందిన టైలర్ కన్హయ్య లాల్ ఆమెకు అనుకూలమైన పోస్టు పెట్టాడు. దీంతో గతేడాది జూన్ 28న గౌస్ మహ్మద్, రియాజ్ అనే ఇద్దరు మతోన్మాదులు కన్హయ్యలాల్ షాపుకి కస్టమర్లుగా వచ్చి, అతనిపై దాడి చేసి తల నరికి చంపారు. ఈ వీడియోను రికార్డ్ చేసి వైరల్ చేశారు. ఈ కేసులో ఎన్ఐఏ 11 మందిని అరెస్ట్ చేసింది.