“Please Save Democracy,” Mamata Banerjee Urges Chief Justice of India: దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థలను నాశనం చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ. ఇదే ధోరణి కొనసాగితే దేశంలో అధ్యక్ష తరహా పాలనకు దారి తీస్తుందని ఆమె హెచ్చరించారు. ప్రజాస్వామ్యం, సమాఖ్య వ్యవస్థను కాపాడాలని ఆమె భారత ప్రధాన న్యాయమూర్తిని కోరారు. కోల్‌కతాలోని నేషనల్ యూనివర్శిటీ ఆఫ్ జురిడికల్ సైన్సెస్ (ఎన్‌యుజెఎస్) స్నాతకోత్సవానికి హాజరైన సిజెఐ జస్టిస్ యుయు లలిత్ సమక్షంలో మమతా బెనర్జీ ఈ వ్యాఖ్యలు చేశారు.
ప్రజలను వేధింపుల నుంచి రక్షించాలని న్యాయవ్యవస్థను కోరారు. సమాజంలో ఓ నిర్ధిష్ట వర్గం ప్రజాస్వామ్య అధికారాన్ని స్వాధీనం చేసుకుంటున్నారని విమర్శించారు. దేశంలో ప్రజాస్వామ్యం ఎక్కడ ఉంది..? ప్రజాస్వామ్యాన్ని రక్షించండి అంటూ కాన్వోకేషన్ కార్యక్రమంలో సీజేఐని కోరారు. మీడియా పక్షపాతం గురించి ఆమె మాట్లాడుతూ.. వారు ఎవరినైనా దుర్భాషలాడగలరా..? ఎవరినైనా నిందించగలారా..? అని ప్రశ్నించారు. మా ప్రతిష్ట మా ఇజ్జత్ అని.. ఒకసారి ప్రతిష్టకు భంగం కలిగితే అంతా అయిపోతుందని మమతా బెనర్జీ అన్నారు.
Read Also: Tammareddy Bharadwaj: విజయ్ దేవరకొండ కోసం అన్ని కోట్లు ఎవడు పెట్టమన్నాడు..?
తీర్పు వెలువడకముందే చాలా విషయాలు జరుగుతున్నాయని సీజేఐ సమక్షంలోనే అన్నారు. ఈ విషయం చెప్పడానికి నన్ను క్షమించండి.. నేను తప్పు చేసినట్లు భావిస్తే క్షమాపణలు చెబుతున్నానని మమతా బెనర్జీ అన్నారు. ఎన్యూజేఎస్ ప్రపంచంలోనే అత్యంత ముఖ్యమైన సంస్థ ఒకటి అని.. సీజేఐ పోషిస్తున్న పాత్ర చాలా ముఖ్యమని.. సీజేఐ యూయూ లలిత్ ను అభినందించారు. రెండు నెలల్లోనే న్యాయవ్యవస్థ అంటే ఎంటో లలిత్ చూపించారని అన్నారు.
ప్రజలు న్యాయవ్యవస్థపై విశ్వాసం కోల్పోయారని నేను అనడం లేదని.. అయితే కానీ ప్రస్తుతం పరిస్థితి మరింత దిగజారిందని అన్నారు. న్యాయవ్యవస్థ ప్రజలను అన్యాయం నుంచి రక్షించాలని.. వారి మొర వినాలని.. ప్రజలు బాధలు పడుతున్నారని మమతా బెనర్జీ అన్నారు.