Pinarayi Vijayan: ‘‘కేరళ మిని పాకిస్తాన్’’ అంటూ బీజేపీ నేత, మహారాష్ట్ర మంత్రి నితీష్ రాణే చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఈ వ్యాఖ్యల్ని కేరళ సీఎం పినరయి విజయన్ తప్పుపట్టారు. ఈ వ్యాఖ్యలు ‘‘ తీవ్రమైన హానికరమైనవి’’, ‘‘పూర్తిగా ఖండించదగినది’’ అని అభివర్ణించారు. ఇది కేరళపై ద్వేషపూరిత ప్రచారాన్ని ప్రతిబింబిస్తోందని అన్నారు. ఈ వ్యాఖ్యలు లౌకికవాదం, మతసామరస్యానికి పునాది అయిన కేరళకు వ్యతిరేకంగా సంఘ్ పరివార్ చేస్తున్న ద్వేషపూరిత ప్రచారమని విమర్శించారు. కేరళపై జరిగిన ఈ నీచమైన దాడిని మేము తీవ్రంగా ఖండిస్తున్నామని పినరయి చెప్పారు. సంఘ్ పరివార్ ద్వేషపూరిత ప్రచారానికి వ్యతిరేకంగా అన్ని ప్రజాస్వామ్య, లౌకిక శక్తులు ఏకం కావాలని ఆయన పిలుపునిచ్చారు.
మహారాష్ట్ర మంత్రి నితీస్ రాణే ఇటీవల ఒక బహిరంగ సభలో మాట్లాడుతూ.. కాంగ్రెస్ నేతలు ప్రియాంకా గాంధీ, రాహుల్ గాంధీలు మినిపాకిస్తాన్ అయిన కేరళ వయనాడ్ నుంచి ఎన్నికయ్యారని అన్నారు. ‘‘కేరళ మిని పాకిస్తాన్, అందుకే రాహుల్ గాంధీ, అతడి సోదరి అక్కడ నంచి గెలిచారు. ఉగ్రవాదులంతా వారికి ఓటు వేస్తారు. ఇది నిజం, ఉగ్రవాదులతో కలిసి ఉండే వారు ఎంపీలుగా మారారు’’ అని రాణే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
Read Also: Bheems Ceciroleo : టాలీవుడ్ లో దూసుకెళ్తున్న భీమ్స్..
ఈ వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. కాంగ్రెస్ అధికార ప్రతినిధి అతుల్ లోంధే మాట్లాడుతూ.. ‘‘నితీష్ రాణే నుంచి ఇంకేం ఆశించవచ్చు..? అతను ఈ పని చేయడానికే ఎన్నికయ్యారు. అతడికి మంత్రి పదవిలో కొనసాగే హక్కు ఉందా అని నేను ప్రధాని మోడీ, సీఎం ఫడ్నవీస్‌లను అడగాలని అనుకుంటున్నా.’’అని అన్నారు. శివసేన ఠాక్రే వర్గం నేత ఆనంద్ దూబే మాట్లాడుతే.. ప్రధాని కేవలం లక్ష ఓట్లతో గెలిచినందుకు బీజేపీ నాయకులు ఆందోళన చెందుతున్నారు. ప్రియాంకాగాంధీ 4 లక్షల ఓట్ల తేడాతో గెలవడాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారని అన్నారు.
విమర్శల నేపథ్యంలో నితీష్ రాణే తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు. కేరళ భారతదేశంలో భాగం, అయితే హిందువుల జనాభా తగ్గడంపై ప్రతీ ఒక్కరూ ఆందోళన చెందుతున్నారు, హిందువులను ముస్లింలుగా, క్రైస్తవులుగా మార్చడం అక్కడ రోజూ సాధారణంగా మారిందని అన్నారు.