RSS: ఔరంగజేబు సమాధి వివాదం నడుస్తు్న్న వేళ, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) కీలక వ్యాఖ్యలు చేసింది. ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యదర్శి దత్తాత్రేయ హోసబాలే మాట్లాడుతూ.. ‘‘ భారతదేశ నైతికతకు వ్యతిరేకంగా ఉన్న వ్యక్తిని ఆరాధిస్తున్నామా..? ఆక్రమణదారుల మనస్తత్వం ఉన్నవారు భారతదేశానికి ముప్పు’’ అని అన్నారు. ఆర్ఎస్ఎస్ అత్యున్నత నిర్ణయాధికార సంస్థ అయిన అఖిల భారతీయ ప్రతినిధి సభ ముగింపు రోజున ఇక్కడ విలేకరులను ఉద్దేశించి హోసబాలే మాట్లాడారు. సామాజిక సామరస్యాన్ని విశ్వసించే ఔరంగజేబు సోదరుడు దారా షికోని కాదని ఔరంగజేబుని ఒక ఐకాన్‌గా చేశారని ఆయన అన్నారు.
గతంలో చాలా సంఘటనలు జరిగాయి. ‘‘ఢిల్లీలో ఔరంగజేబు రోడ్డు ఉండేది, దానికి అబ్దుల్ కలాం రోడ్డుగా మార్చారు. దాని వెనక కారణం ఉంది. ఔరంగజేబు సోదరుడు దారుషికోని హీరోగా చేయలేదు. గంగా-జముని సంస్కృతిని సమర్థించే వారు దారా షికోను ముందుకు తీసుకురావాలని ఎప్పుడూ అనుకోలేదు. భారతదేశ నైతికతకు వ్యతిరేకంగా ఉన్న వ్యక్తిని మనం ఐకాన్‌గా చూపిస్తామా లేక ఈ భూమి సంప్రదాయాల ప్రకారం పనిచేసే వారితో మనం వెళ్తామా?’’ అని ఆయన అడిగారు.
Read Also: Murder : రంగారెడ్డి జిల్లాలో దారుణం.. అప్పుల వివాదంతో యువకుడి దారుణ హత్య
ఆక్రమణదారుల మనస్తత్వం ఉన్న వ్యక్తులు దేశానికి ముప్పు కలిగిస్తారని, మొఘల్ చక్రవర్తి అక్బర్‌కు వ్యతిరేకంగా పోరాడిన రాజ్‌పుత్ రాజు మహారాణా ప్రతాప్ వంటి వ్యక్తులను హోసబాలే ప్రశంసించారు. ‘‘ బ్రిటిషర్లకు వ్యతిరేకంగా జరిగిన పోరాటం స్వాతంత్య్ర పోరాటం. వారికి ముందు ఉన్నవారికి వ్యతిరేకంగా జరిగిన పోరాటం కూడా ఒక స్వాతంత్య్ర పోరాటమే. మహారాణా ప్రతాప్ స్వేచ్ఛ కోసం పోరాటం చేశారు. ఆక్రమణదారుల మనస్తత్వం ఉన్న వ్యక్తులు దేశానికి ప్రమాదం. మన దేశ నైతికతతో ఎవరు సరిపోతారో మనం నిర్ణయించుకోవాలి. ఇది మతం గురించి కాదు. ఇది ఆర్ఎస్ఎస్ దృఢమైన అభిప్రాయం’’ అని అన్నారు.
వక్ఫ్ బిల్లుపై మాట్లాడుతూ.. ప్రభుత్వం వక్ఫ్‌పై ఒక కమిషన్ ఏర్పాటు చేసింది, వారు ఏమి తీసుకువస్తారో చూద్దాము, ఇప్పటి వరకు జరిగిందంతా సరైన దిశలోనే జరిగిందని, భవిష్యత్తులో ఏం జరుగుతుందో చూద్ధామని అన్నారు. బీజేపీ కొత్త అధ్యక్షుడి ఎన్నికపై మాట్లాడుతూ, దీంట్లో ఎలాంటి జోక్యం ఉండదని, అది బీజేపీ చేస్తుందని, సంఘ్ కింద 32కి పైగా సంస్థలు ఉన్నాయని, ప్రతీది కూడా స్వతంత్రమైనదే అని, సొంత నిర్ణయాలు తీసుకుంటుందని చెప్పారు