Pani Puri: ‘‘పానీపూరీ’’ మనదేశంలో ప్రసిద్ధిమైన స్ట్రీట్‌ఫుడ్. పిల్లల నుంచి పెద్దల దాకా సాయంత్రం వేళల్లో పానీపూరీ బండ్లు కలకలలాడుతుంటాయి. ఇంత క్రేజ్ ఉన్న ఈ పానీపూరీ వ్యాపారం ద్వారా విక్రేతలు లక్షల్లో సంపాదిస్తున్నారు. నిజానికి పానీపూరీ లేదా గోల్‌గప్పా పేరు ఏదైనా కానీ, ఈ వ్యాపారం ఇతర ఉద్యోగాల కన్నా చాలా బెటర్ అంటూ సోషల్ మీడియాలో రీల్స్, మీమ్స్ తెగవచ్చాయి.
Read Also: Allu Arjun : నాంపల్లి కోర్టుకు అల్లు అర్జున్.. మేజిస్ర్టేట్ ఎదుట పత్రాలపై సంతకం
ఇదిలా ఉంటే, తాజాగా తమిళనాడుకు చెందిన ఓ పానీపూరీ విక్రేత రికార్డు స్థాయిలో UPI చెల్లింపులను స్వీకరించిన తర్వాత, జీఎస్టీ అధికారులు నోటీసులు పంపారు. ఏడాదిలో ఏకంగా రూ. 40 లక్షల చెల్లింపులను రేజర్ పే, ఫోన్‌పే ద్వారా అందుకున్నట్లు తెలిసింది. గత 3 ఏళ్లలో ఈ చెల్లింపులను ట్రాక్ చేసి విక్రేతకు తమిళనాడు జీఎస్‌టీ, సెంట్రల్ జీఎస్టీ చట్టాల ప్రకారం విక్రేతకు నోటీసులు పంపారు. విక్రేత చట్టాలకు అనుగుణంగా నమోదు చేసుకోలేదని అధికారులు ఆరోపించారు.
నోటీసుల ప్రకారం.. పానీపూరీ బిజినెస్ ద్వారా 2023-24 ఆర్థిక ఏడాదిలో రూ. 40,11,019 టర్నోవర్ జరగడం జీఎస్టీ అధికారుల కళ్లలో పడింది. ఇది చట్ట ప్రకారం.. జీఎస్టీ రిజిస్ట్రేషన్ తప్పనిసరి చేసే ఏదైనా ఒక ఎంటిటీ కనిష్ట మొత్తం కన్నా ఇది రెండు రెట్లు ఎక్కువ. డిసెంబర్ 17, 2024న నోటీసుల ప్రకారం.. విక్రేత వ్యక్తిగతంగా హాజరుకావాలని, కేసుకు మద్దతుగా పత్రాలు సమర్పించమని సమన్లు అందుకున్నాడు. దీనిపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ఒక ఇంజనీర్, ప్రొఫెసర్ సంపాదించే డబ్బు కన్నా పానీపూరీ వ్యాపారి సంపాదిస్తున్న రూ. 40 లక్షలు చాలా ఎక్కువ అని నెటిజన్లు అవాక్కవుతున్నారు.